/rtv/media/media_files/2026/05/30/fotojet-49-2026-05-30-15-25-26.jpg)
Major terror plot foiled, 9 arrested
Terror Module : దేశ రాజధాని దిల్లీతో పాటు ముంబయి తదితర నగరాల్లో భారీ ఎత్తున దాడులు, పేలుళ్లు జరిపేందుకు పన్నిన ఒక వ్యూహాత్మక ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం (Special Cell) విజయవంతంగా భగ్నం చేసింది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI), ముంబయి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నెట్‌వర్క్‌తో ప్రత్యక్ష సంబంధాలున్న తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను శనివారం (మే 30) పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారం, పటిష్టమైన నిఘా ఆధారంగా స్పెషల్ సెల్ అధికారులు ఉమ్మడి ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్‌వర్క్‌ను ఛేదించారు. అరెస్ట్ అయిన వారిలో దిల్లీ, ముంబయి, పంజాబ్‌కు చెందిన వారితో పాటు కొందరు విదేశీయులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అరెస్ట్ అయిన ముఠా సభ్యుల నుంచి పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ముఠా దేశంలోని అత్యంత కీలకమైన భద్రతా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంది. వీరి టార్గెట్ జాబితాలో దేశంలోని అణు కేంద్రాలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ ప్లాంట్లతో పాటు ప్రముఖ ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా సిబ్బంది మరియు రద్దీగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఈ కీలక ప్రదేశాలపై ఏకకాలంలో దాడులు జరిపి దేశాన్ని అతలాకుతలం చేయడమే వీరి ప్రధాన వ్యూహంగా తేలింది.
భారత్‌లో విధ్వంసం సృష్టించేలా ఈ ఉగ్ర మాడ్యూల్‌కు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిందితులు పాక్ ఐఎస్‌ఐ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉంటూ వారి ఆదేశాలను పాటించేవారని దిల్లీ స్పెషల్ సెల్ ఉన్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. ఈ దాడులకు అవసరమైన భారీ నిధులను, పేలుడు పదార్థాలను భారత్‌లోకి చేరవేయడానికి మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన అండర్‌వరల్డ్ నెట్‌వర్క్ సహాయం తీసుకున్నట్లు విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం నిందితులను క్షుణ్ణంగా విచారిస్తూ, ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న మరికొంత మంది సమాచారాన్ని సేకరిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రదాడి ముప్పు పొంచి ఉందంటూ ఈ నెల ప్రారంభంలోనే కేంద్ర నిఘా వర్గాలు (Intelligence Agencies) గట్టి హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా వాహనాల ముసుగులో ఐఈడీ (IED) పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు,కాల్పులు జరిగే ప్రమాదం ఉందని సూచించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమై, పారా మిలటరీ బలగాలతో పహారాను మరింత పటిష్టం చేసింది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలోనే దిల్లీ పోలీసులు సుదీర్ఘ ప్లానింగ్‌తో దావూద్, ఐఎస్‌ఐ అనుబంధ ముఠాను సకాలంలో పట్టుకోవడంతో దేశంలో జరగాల్సిన ఒక భారీ విపత్తు తప్పినట్లయింది.
Follow Us