/rtv/media/media_files/2025/02/09/HWgwjx548j9uECQTls6O.jpg)
bjp cms
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించి బీజేపీ బంపర్ విక్టరీ కొట్టింది. దీంతో 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రాబోతోంది. అంతకుముందు, 1993 నుంచి 1998 మధ్య, ముగ్గురు బీజేపీ నాయకులు ఢిల్లీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వాళ్ళ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. వారే మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, సుష్మా స్వరాజ్. ఈ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల పదవీకాలం ఎలా సాగిందో తెలుసుకుందాం.
మదన్ లాల్ ఖురానా (1993-1996)
దివంగత నేత మదన్ లాల్ ఖురానా ఢిల్లీకి మొదటి బీజేపీ ముఖ్యమంత్రి. 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు గెలుచుకోని అధికారంలోకి వచ్చింది. అనంతరం ఖురానా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈయన్ను ఢిల్లీ సింహం అని పిలిచేవారు. ఆయన పదవీకాలంలో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. కానీ 1995లో హవాలా కుంభకోణంలో ఈయన పేరు వినిపించడంతో సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు.
సాహిబ్ సింగ్ వర్మ (1996-1998).
మదన్ లాల్ ఖురానా రాజీనామా తర్వాత దివంగత నేత సాహిబ్ సింగ్ వర్మ 1996 ఫిబ్రవరి 27న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాహిబ్ సింగ్ వర్మ పదవీకాలంలో అనేక ఆర్థిక, మౌలిక సదుపాయాల సమస్యలు తలెత్తాయి. విద్యుత్, నీటి సమస్యలతో పాటు, ఉల్లిపాయల ధరలు పెరగడం ప్రజలను ముఖ్యంగా ప్రభావితం చేసింది. అంతేకాకుండా బీజేపీలో అంతర్గత కలహాలు కూడా కొనసాగాయి. పెరుగుతున్న ప్రజా ఆగ్రహం కారణంగా, 1998 ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు . ఆయన మొత్తం రెండు సంవత్సరాల 228 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
సుష్మా స్వరాజ్ (1998)
బీజేపీ ఫైర్‌బ్రాండ్, ప్రముఖ దివంగత నాయకురాలు సుష్మా స్వరాజ్ 1998 అక్టోబర్ లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈమె ఢిల్లీకి మొదటి మహిళా సీఎం కావడం విశేషం. అయితే ఈమె పదవీకాలం 52 రోజులు మాత్రమే కొనసాగింది. ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే, పెరుగుతున్న ఉల్లిపాయ ధరలను నియంత్రించడానికి చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో ఉల్లిపాయలను చౌక ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కానీ ఈ ప్రయత్నాలు బీజేపీని కాపాడలేకపోయాయి. 1998 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 52 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చి... తదుపరి 15 సంవత్సరాలు ఢిల్లీలో అధికారంలో కొనసాగింది.
సీఎం రేసులో పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ
ఇప్పుడు 2025 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అంటే 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, న్యూఢిల్లీ స్థానం నుండి పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. ఈయన సీఎం రేసులో ఉన్నారు. మరి సీఎం పదవీ ఎవరిని వరిస్తుందో చూడాలి.
Also read : Thandel Movie: నాగచైతన్యకు బిగ్ షాక్.. ఆన్ లైన్ లో 'తండేల్' HD ప్రింట్!