ATM & Currency Notes : కేంద్రం కీలక నిర్ణయం.. చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు

సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో రూ.100 వరకు మాత్రమే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చిన్న నోట్లు అయిన రూ.50, రూ.20,రూ10 వంటి నోట్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇక మీదట చిన్న కరెన్సీ నోట్లను కూడా డ్రా చేసుకునే మిషన్లు అందుబాటులోకి రానున్నాయి.

New Update
Health ATMs

ATM & Currency Notes

ATM & Currency Notes : సాధారణంగా మనం ఉపయోగించే ఏటీఎంలలో వందరూపాయల వరకు మాత్రమే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకు మించి చిన్న నోట్లు అయిన రూ.50, రూ.20,రూ10 వంటి నోట్లు డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండదు. దీంతో చిన్న నోట్లు అవసరం ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఈ చిన్న మొత్తాల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకమీదట ఏటీఎంల నుంచి చిన్న కరెన్సీ నోట్లను కూడా డ్రా చేసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. చిన్ననోట్ల కొరత ఉందనే ప్రచారం నేపథ్యంలో తరచూ వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం చిన్ననోట్లను ఏటీఎంల నుంచి డ్రా చేసుకునే వెసలుబాటును కల్పించాలని నిర్ణయించింది.
 
అయితే మనం సాధారణంగా వినియోగించే  ఏటీఎంలలో ఎప్పుడు నగదు విత్‌డ్రా చేసినా పెద్ద కరెన్సీ నోట్లే వస్తుంటాయి. అందులో రూ.100, రూ.200, రూ.500 నోట్లకు మాత్రమే పరిమితం. ఇక చిన్నపాటి లావాదేవీల సమయంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో రూ.10, రూ.20, రూ.50 తరహా కరెన్సీ నోట్లు ఏటీఎంల ద్వారా వస్తే బాగుండు అని మనకు చాలాసార్లు అనిపించి ఉంటుంది. ఇటీవల చాలా సందర్భాల్లో చిన్న నోట్ల చలామణి తగ్గింది. దీంతో చిన్ననోట్ల కొరత ఏర్పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే విషయంపై పార్లమెంటులో చర్చ సాగింది. ప్రతిపక్ష నేతలు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం స్పష్టతనిచ్చింది.
 
దేశంలో చిన్న కరెన్సీ నోట్ల కొరత ఏం మాత్రం లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. ఈ మేరకు రాజ్యసభలో లేవనెత్తిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. 'ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ప్రస్తుతమున్న సంప్రదాయ ఏటీఎంలు చిన్న కరెన్సీ నోట్లను పంపిణీ చేయలేవని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్ మెషీన్లను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మెషీన్ల ద్వారా రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా డ్రా చేసుకునే వీలుంటుంది' అని ఆయన సభలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అమల్లోకి వస్తే.. ఏటీఎంల నుంచి చిన్న నోట్లను డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా  రోజువారీ లావాదేవీల్లో పెద్ద నోట్ల మార్పిడి సమస్యకు చెక్ పడే అవకాశముంది.


ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఫిబ్రవరి 26 వరకు మన దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. వాటిలో రూ.439.4 కోట్ల విలువైన రూ.10 నోట్లు, రూ.193.7 కోట్ల విలువైన రూ.20 నోట్లు, రూ.130.3 కోట్ల విలువైన రూ.50 నోట్లు చలామణిలోఉన్నాయి. ఇక గత ఆర్థిక ఏడాదిలో  రూ.10 నోట్లు - రూ.150 కోట్లు, రూ.20 నోట్లు - రూ.150 కోట్లు, రూ.50 నోట్లు - రూ.300 కోట్ల ఆర్బీఐ  సరఫరా చేసింది.

Advertisment
తాజా కథనాలు