Allahabad : 42 ఏళ్ల తరువాత.. 100 ఏళ్ల వృద్ధుడికి హత్య కేసులో విముక్తి

భారత న్యాయవ్యవస్థలో ఒక అరుదైన తీర్పు వెలువడింది. ఏకంగా 42 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది.

New Update
court

భారత న్యాయవ్యవస్థలో ఒక అరుదైన తీర్పు వెలువడింది. ఏకంగా 42 ఏళ్ల క్రితం నాటి హత్య కేసులో 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేకపోవడం, అప్పీల్ పరిష్కారంలో దశాబ్దాల కాలం గడిచిపోవడాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు, నిందితుడికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విముక్తి కల్పించింది.

ఈ కేసు నేపథ్యం 1982 ఆగస్టు 9కి వెళుతుంది. ఉత్తరప్రదేశ్ హమీర్‌పూర్ జిల్లాలో భూవివాదం కారణంగా గున్వాఅనే వ్యక్తి కాల్చి చంపబడ్డాడు. ఈ ఘటనలో మైకు అనే వ్యక్తి కాల్పులు జరపగా, ధనిరామ్ మరియు సత్తిదీన్ అనే ఇద్దరు అతడిని రెచ్చగొట్టారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. 1984లో సెషన్స్ కోర్టు వీరికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ

సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ధనిరామ్, సత్తిదీన్ 1984లోనే హైకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో వారికి బెయిల్ మంజూరైంది. అయితే, అప్పటి నుండి ఈ అప్పీల్ కోర్టులో పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఈ సుదీర్ఘ కాలంలో రెండో నిందితుడు సత్తిదీన్ మరణించగా, ధనిరామ్ వంద ఏళ్ల వయస్సులో ఏకైక అప్పీల్దారుగా మిగిలారు. ప్రధాన నిందితుడు మైకును పోలీసులు ఇప్పటివరకు పట్టుకోలేకపోవడం గమనార్హం.

హైకోర్టు ఏమందంటే?
జస్టిస్ చంద్రధారి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ప్రాసిక్యూషన్ కథనంలో అనేక లొసుగులు ఉన్నాయని, నిందితుడికి వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లేవని కోర్టు అభిప్రాయపడింది.  అప్పీల్ పరిష్కారం కావడానికి 40 ఏళ్లు పట్టడం, నిందితుడి వయస్సు ప్రస్తుతం 100 ఏళ్లు ఉండటం వంటి అంశాలను కోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ధనిరామ్‌ను అన్ని ఆరోపణల నుండి విముక్తం చేస్తూ, అతని బెయిల్ బాండ్లను రద్దు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పుతో వృద్ధాప్యంలో ఆయనకు ఊరట లభించినప్పటికీ, న్యాయం కోసం నాలుగు దశాబ్దాల పాటు వేచి చూడాల్సి రావడం గమనార్హం. ఈ ఘటన భారత క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో ఉన్న జాప్యాన్ని మరోసారి ఎత్తిచూపింది.

Advertisment
తాజా కథనాలు