/rtv/media/media_files/2026/06/13/jayalalithaa-2026-06-13-07-07-45.jpg)
Jayalalithaa's death case
Jayalalithaa : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, 'అమ్మ' జె.జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీపై దర్యాప్తు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆమె మరణంపై ఏర్పాటైన జస్టిస్ ఎ.ఆరుముగసామి కమిషన్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు రాష్ట్రంలోని నూతన విజయ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందనే బలమైన సంకేతాలు అందుతున్నాయి. దశాబ్ద కాలంగా తమిళ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందా లేదా కమిషన్ నివేదికలో స్పష్టత రాని మరికొన్ని కీలక అంశాలపై పునర్విచారణకు ఆదేశిస్తుందా అనే ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.
సామాజిక కార్యకర్త రామకృష్ణన్ సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా చేసిన దరఖాస్తుతో ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. జయలలిత మరణంపై ఏకసభ్య కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రస్తుత స్థితిపై ఆయన ప్రశ్నించారు. దీనికి పబ్లిక్ డిపార్ట్‌మెంట్ ఇచ్చిన సమాధానం ప్రకారం.. ఈ కేసులో తుది నిర్ణయం తీసుకునే విషయమై ప్రస్తుతం లోతైన పరిశీలనలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఆరోగ్యశాఖ, ప్రధాన కార్యదర్శి కార్యాలయ అధికారులు, పోలీసుశాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ నడుస్తోందని, అయితే దర్యాప్తు జరుపుతున్న అధికారుల వివరాలు, సమగ్ర సమాచారాన్ని భద్రతా కారణాల దృష్ట్యా బయటికి వెల్లడించలేమని అధికారులు స్పష్టం చేశారు. దీనిపై తుది నిర్ణయాన్ని రాష్ట్ర క్యాబినెట్ తీసుకోనుంది.
ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. 2016 సెప్టెంబరు 22న జయలలిత ఆకస్మిక అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. దాదాపు 75 రోజుల పాటు చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబరు 5న ఆమె కన్నుమూశారు. అయితే, ఆమెకు అందిన వైద్యంలో తీవ్ర లోపాలున్నాయని, మరణం వెనుక పెద్ద కుట్ర జరిగిందనే ఆరోపణలు రావడంతో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఆరుముగసామి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ సుదీర్ఘంగా విచారణ జరిపి, కీలక వ్యక్తుల వివరణలను నమోదు చేసి 2022 ఆగస్టు 27న అప్పటి డీఎంకే ప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అప్పటి సీఎం స్టాలిన్ ప్రకటించినప్పటికీ, తదుపరి కదలిక లేకపోవడంతో ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది.
ఆరుముగసామి కమిషన్ నివేదికలో పలువురు కీలక వ్యక్తులపై తిరిగి సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరముందని గట్టిగా సిఫారసు చేశారు. జయలలిత అంతరంగిక నెచ్చెలి వి.కె.శశికళ, అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి సి.విజయభాస్కర్, ఆరోగ్యశాఖ పూర్వ కార్యదర్శి జె.రాధాకృష్ణన్‌తో పాటు మరికొందరు ఉన్నతాధికారుల పేర్లను కమిషన్ ఆ నివేదికలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీరి పాత్రపై మరింత లోతుగా విచారణ జరిపితేనే అసలు నిజాలు బయటపడతాయని కమిషన్ భావించింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సిఫారసుల ఆధారంగానే చట్టపరమైన చర్యలకు లేదా పునర్విచారణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో అయిన ఖర్చుల వివరాలు సామాన్య ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆర్‌టీఐ దరఖాస్తు ద్వారా అందిన సమాచారం ప్రకారం.. అప్పట్లో అన్నాడీఎంకే ప్రభుత్వం జయలలిత వైద్యం, ఇతర ఛార్జీల నిమిత్తం అపోలో ఆసుపత్రికి ఏకంగా రూ.6.85 కోట్లు చెల్లించింది. ఇందులో కేవలం 75 రోజుల అన్నపానీయాల (క్యాటరింగ్) కోసమే రూ.1.17 కోట్లు ఖర్చయినట్లు చూపడం గమనార్హం. అలాగే గదుల అద్దె కింద రూ.2.72 కోట్లు, ఇతర ఆరోగ్య సేవలకు రూ.1.92 కోట్లు, ప్రొఫెషనల్ ఛార్జీల కింద రూ.2.20 కోట్లు చెల్లించారు. కాగా, 2018 డిసెంబరు నాటికి ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యానికి ఇంకా రూ.45 లక్షల బకాయి పడినట్లు కూడా ఈ నివేదికల ద్వారా వెల్లడైంది.
రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఈ కేసుపై సామాజిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మరణంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకునేందుకు గత ప్రభుత్వాలు వెనకడుగు వేశాయని సామాజిక కార్యకర్త రామకృష్ణన్ ఆరోపించారు. ఈ కేసు ప్రస్తుత స్థితిని, నివేదికలోని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఆలస్యమైందో చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. దాదాపు పదేళ్లుగా తమిళనాడు ప్రజలు ఈ కేసులో న్యాయం కోసం, నిజాలు తెలుసుకోవడం కోసం ఎదురుచూస్తున్నారని, కొత్త ప్రభుత్వమైనా ఈ మిస్టరీని ఛేదించి పారదర్శకతను నిరూపించుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు.
Follow Us