/rtv/media/media_files/2026/04/28/indore-2026-04-28-19-51-29.jpg)
గతేడాది మే నెలలో దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి ఎట్టకేలకు ఊరట లభించింది. గత పది నెలలుగా జైలులో ఉన్న ఆమెకు, మూడుసార్లు పిటిషన్లు తిరస్కరణకు గురైన తర్వాత, నాలుగోసారి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సోనమ్ తరపున ఆమె తండ్రి, కజిన్ షిల్లాంగ్ చేరుకుని పూచీకత్తు బాండ్ సమర్పించడంతో ఆమె నేడు జైలు నుంచి విడుదల కానుంది.
అసలేం జరిగింది?
మధ్యప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ దంపతులు 2025 మే నెలలో హనీమూన్ కోసం మేఘాలయా వెళ్లారు. అక్కడ సోహ్రా (చిరపుంజీ) ప్రాంతంలో విహరిస్తుండగా ఇద్దరూ కనిపించకుండా పోయినట్లు వార్తలొచ్చాయి. పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టగా, జూన్ 2న ఒక లోతైన లోయలో రాజా మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో లభించింది.
ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సోనమ్ తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు తేలింది. రాజాను వదిలించుకోవడానికి వారు గతంలో మూడుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారని, నాలుగో ప్రయత్నంలో మేఘాలయాలో కిరాయి హంతకులతో చంపించారని పోలీసులు 790 పేజీల ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత సోనమ్ ఉత్తరప్రదేశ్‌కు పారిపోయి, అక్కడ పోలీసులకు పట్టుబడింది.
దర్యాప్తు మొత్తం పూర్తయిందని, ఇప్పటికే ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారని నిందితురాలి లాయర్లు వాదించారు. గత 10 నెలలుగా జైలులో ఉన్నానని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని సోనమ్ కోర్టుకు విన్నవించుకుంది. దీంతో కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా మాత్రం ఇంకా జైలులోనే ఉన్నాడు.హనీమూన్ వెళ్లిన చోటే భర్తను అంతమొందించిన ఈ క్రూరమైన ఘటన అప్పట్లో పెను సంచలనమే సృష్టించింది. ఇప్పుడు ఆమె బెయిల్ పై బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.
రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ వివాహం 2025, మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. పెళ్లయిన కేవలం 9 రోజులకే, అంటే మే 20న వారు హనీమూన్ కోసం మేఘాలయకు బయలుదేరి వెళ్లారు.
అయితే హనీమూన్‌కు వెళ్లిన మూడు రోజులకే (మే 23న) రాజా కనిపించకుండా పోవడం, ఆ తర్వాత జూన్ 2న ఆయన మృతదేహం లభించడంతో ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో సోనమ్ నిందితురాలిగా తేలడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
Follow Us