/rtv/media/media_files/2026/05/12/aiadmk-leader-cv-shanmugam-edappadi-k-palaniswami-r-2026-05-12-09-47-46.jpg)
AIADMK leaders CV Shanmugam (L), Edappadi K Palaniswami (R)
AIADMK : తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం రేపుతూ అన్నాడీఎంకే (AIADMK) పార్టీలో భారీ చీలిక అధికారికంగా బటయపడింది. మాజీ మంత్రి, సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని వర్గం.. ప్రస్తుత ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు తమ మద్దతును ప్రకటించింది. డీఎంకేతో అన్నాడీఎంకే కలవడానికి ప్రయత్నించిందని, ఆ ధోరణి నచ్చకే తాము ఎడప్పాడి పళనిస్వామి (EPS) వర్గం నుంచి విడిపోయినట్లు సీవీ షణ్ముగం స్పష్టం చేశారు. సీఎం విజయ్‌కు అండగా నిలవాలని తమ వర్గంలోని 30 మంది ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు ఆయన వెల్లడించారు.
ఐదు దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన కూటముల్లో ఈ పరిణామం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇటీవలి ఎన్నికల్లో అన్నాడీఎంకే 47 స్థానాల్లో విజయం సాధించగా.. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు సొంతంగా పూర్తి మెజారిటీ రాలేదు. దీంతో ఇతర పార్టీల మద్దతుతో ఆయన అధికారం చేపట్టారు. ఆ సమయంలోనే విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి సీవీ షణ్ముగం నేతృత్వంలో 36 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. అయితే, చివరి నిమిషంలో డీఎంకే కూటమిలోని పార్టీలు విజయ్‌కు మద్దతు పలకడంతో షణ్ముగం వర్గం అవసరం లేకుండానే ప్రభుత్వం ఏర్పాటయింది. ఆ తర్వాత కూడా పళనిసామి జరిపిన చర్చలు విఫలం కావడంతో ఈ వర్గం విడిగానే ఉండిపోయింది.
అసెంబ్లీలో బయటపడ్డ వర్గపోరు
సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలిరోజే అన్నాడీఎంకేలోని అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. పళనిసామి పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచే కాకుండా, శాసనసభాపక్ష నేత పదవి నుంచి కూడా తప్పుకోవాలని షణ్ముగం వర్గం డిమాండ్ చేస్తోంది.అసెంబ్లీలో కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పళనిసామి వెంట నిలిచారు. ఆయన్నే తమ శాసనసభాపక్ష నేతగా గుర్తించాలని వారు అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ఇచ్చారు.మరోవైపు, విడిగా ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు తమ గ్రూపు తరఫున ఎస్పీ వేలుమణిని ఏఐఏడీఎంకే పక్షనేతగా గుర్తించాలంటూ విడిగా లేఖ సమర్పించారు.ఈ రెండు గ్రూపుల్లో స్పీకర్ ఎవరిని అధికారిక పక్షనేతగా గుర్తిస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. జయలలిత మరణం తర్వాత శశికళ, ఓపీఎస్ వంటి కీలక నేతలు దూరమవ్వగా, ఇప్పుడు పార్టీలో ముదిరిన వివాదాల వల్ల మరికొందరు నేతలు కూడా వేరుకుంపటి పెట్టే యోచనలో ఉన్నట్లు అన్నాడీఎంకే కీలక నేత కేసీ పళనిసామి ధ్రువీకరించారు. కాగా, ఈ పరిణామాలపై మిత్రపక్షమైన బీజేపీ ప్రస్తుతానికి మౌనం వహిస్తోంది.
మారుతున్న సమీకరణాలు
మరోవైపు తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కీలక పాత్ర పోషించాయి. అయితే, స్థానిక పార్టీలు డీఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకోగా.. కాంగ్రెస్ మాత్రం పొత్తు ధర్మాన్ని పక్కనబెట్టి ముందే టీవీకేతో చేతులు కలిపింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తికి గురైన డీఎంకే.. ఆ పార్టీతో బంధాన్ని తెంచుకోవడమే కాకుండా, ఇకపై తాము 'ఇండియా' (INDIA) కూటమిలో ఉండబోమని సంచలన ప్రకటన చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో డీఎంకే భవిష్యత్తు జాతీయ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అదే సమయంలో, ఎలాగైనా టీవీకేను ఇండియా కూటమిలోకి ఆహ్వానించి, దక్షిణాది రాష్ట్రాల్లో సీఎం విజయ్ క్రేజ్‌ను తమకు అనుకూలంగా వాడుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహాలు రచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
Follow Us