/rtv/media/media_files/2026/04/18/da-2026-04-18-14-34-36.jpg)
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరటనిచ్చే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 2 శాతం పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. సాధారణంగా ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏటా జనవరి, జూలై నెలల్లో ఈ భత్యాన్ని సవరిస్తుంటారు. లేబర్ మినిస్ట్రీ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రతి నెలా విడుదల చేసే పారిశ్రామిక కార్మికుల వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ పెంపును లెక్కిస్తారు. అయితే ఈసారి డీఏ ప్రకటనలో జాప్యం జరగడంపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికుల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణంగా సెప్టెంబర్ చివరలో ఈ ప్రకటన వెలువడి, అక్టోబర్ ప్రారంభంలో బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని సమాఖ్య గుర్తు చేసింది.
మరోవైపు, ఇదే సమావేశంలో రాజకీయ అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వని ప్రతిపక్షాల తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించి పెద్ద తప్పు చేశాయని, దీనికి సంబంధించిన రాజకీయ మూల్యాన్ని భవిష్యత్తులో తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని హెచ్చరించారు. ప్రతిపక్షాల వైఖరి మహిళల పట్ల వారికున్న ప్రతికూల ఆలోచనా దృక్పథాన్ని ప్రతిబింబిస్తోందని, ఈ విషయాన్ని దేశంలోని ప్రతి గ్రామానికి చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు. బిల్లును అడ్డుకోవడం ద్వారా వారు దేశ మహిళలను ఓడించారని, ఇప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని విమర్శించారు..
సావరిన్ మ్యారిటైమ్ ఫండ్ ఏర్పాటు
వీటితో పాటు ఆర్థిక, మౌలిక సదుపాయాల రంగానికి సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. సుమారు 13,000 కోట్ల రూపాయల నిధితో సావరిన్ మ్యారిటైమ్ ఫండ్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. భారతీయ జెండాతో నడిచే నౌకలకు, అలాగే భారత్‌కు వచ్చి వెళ్లే నౌకలకు స్థిరమైన, తక్కువ ఖర్చుతో కూడిన బీమా సౌకర్యాన్ని కల్పించడం ఈ నిధి ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనను 2028 వరకు పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కోసం అదనంగా 3,000 కోట్ల రూపాయలను కేటాయించడం విశేషం.
Follow Us