/rtv/media/media_files/2026/06/14/sarthak-siddhant-2026-06-14-07-58-05.jpg)
Sarthak Siddhant, mother
Sarthak Siddhant : ఇది ఇంటర్నెట్ యుగం.. జెన్‌జీ (GenZ) తరం కాలం. నేటి తరం యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా, సమాజంలోని లోపాలను, వ్యవస్థలోని అన్యాయాలను ఎదిరించడానికి సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. తమ ముందు తరం కంటే ఎక్కువ దూకుడు, ఆ దూకుడికి తగ్గ మేధస్సు తమకు ఉందని నిరూపిస్తోంది. అందుకు సజీవ సాక్ష్యంగా నిలిచాడు ఝార్ఖండ్‌కు చెందిన సార్థక్ సిద్ధాంత్ అనే టీనేజర్. దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ అయిన సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల మూల్యాంకన విధానంలోని లోపాలను ఎండగట్టి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.
సార్థక్ సిద్ధాంత్ ఝార్ఖండ్‌లోని బొకారో స్టీల్‌ప్లాంట్ పరిసరాల్లో జన్మించాడు. అతని తల్లిదండ్రులు కంప్యూటర్ శిక్షణ సంస్థను నడిపేవారు. ఎన్నో అడ్డంకులను అధిగమించి కులాంతర వివాహం చేసుకున్న ఆ దంపతులు ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. చుట్టూ జరిగే అన్యాయాలపై స్పందించడం, సామాజిక స్పృహ కలిగి ఉండటం పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పారు. తల్లిదండ్రుల నుంచి కంప్యూటర్ నైపుణ్యాలను పుణికిపుచ్చుకున్న సార్థక్, ఆరేళ్ల వయసులోనే ఇంటర్నెట్ వాడకంపై పట్టు సాధించాడు. 12 ఏళ్లకే ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుని, తాను చదువుతున్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వెబ్‌సైట్‌లోని లోపాలను గుర్తించి యాజమాన్యానికి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
సార్థక్ పదో తరగతి చదువుతున్న సమయంలో తండ్రి అనారోగ్యంతో మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ సమయంలో అతని తల్లి ధైర్యం కోల్పోకుండా ఇద్దరు పిల్లలను తీసుకుని రాష్ట్ర రాజధాని రాంచీకి మారింది. తల్లి ద్వారానే సార్థక్ దేశంలో జరుగుతున్న సామాజిక, రాజకీయ పరిణామాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. ప్రతిరోజూ రాత్రి భోజనం చేస్తూ, ఆ రోజు వార్తలను విశ్లేషించుకోవడం వారి దినచర్యగా మారింది. ఈ అలవాటే సార్థక్‌లో సమాజం పట్ల బాధ్యతను, ప్రజా సమస్యలపై పోరాడే తత్వాన్ని మరింతగా పెంచింది.
సాంకేతికతను ప్రజాసేవకు ఉపయోగించాలనుకున్న సార్థక్, 2023లో ‘సివిక్ టెక్’ భావనతో రాంచీ నగరంలోని దెబ్బతిన్న రోడ్ల సమస్యపై ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించాడు. నగరంలో ఎక్కడైనా రోడ్డుపై గుంతలు కనిపిస్తే, ప్రజలు ఆ ఫొటో తీసి, ఆ ప్రాంతం వివరాలతో వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ వెబ్‌సైట్ స్వయంచాలకంగా (Automatically) ఆ ప్రాంతం ఏ కార్పొరేషన్ డివిజన్ పరిధిలోకి వస్తుందో గుర్తించి, సంబంధిత అధికారికి లేదా ప్రజాప్రతినిధికి ఫిర్యాదు లేఖ పంపుతుంది. ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు హెచ్చరికలు పంపుతూనే ఉంటుంది. ఈ వినూత్న వెబ్‌సైట్ రాంచీలో ఎంతగానో విజయవంతమైంది.
రోడ్ల సమస్యపై పనిచేస్తున్న క్రమంలోనే సార్థక్‌కు ప్రభుత్వ టెండర్ల ప్రక్రియ, అందులో జరిగే అవకతవకలపై పూర్తి అవగాహన ఏర్పడింది. అదే సమయంలో ‘హిందూస్థాన్ టైమ్స్’ ఆంగ్ల పత్రికలో పనిచేస్తున్న యువ విలేకరి సంజయ్ మౌర్యతో సార్థక్‌కు పరిచయమైంది. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలోని సాంకేతిక లోపాలను, టెండర్ల లోసుగులను సార్థక్ గుర్తిస్తుంటే.. సంజయ్ వాటిని పత్రికా ముఖంగా వార్తలుగా రాస్తూ సమాజానికి చేరవేసేవాడు. వీరిద్దరి కలయిక వ్యవస్థలోని అనేక అక్రమాలను బయటకు తీయడానికి కారణమైంది.
మే 3న విడుదలైన సీబీఎస్‌ఈ ప్లస్ టూ ఫలితాలలో కేవలం 85.20 శాతం మాత్రమే ఉత్తీర్ణత నమోదైంది. ఇది 2019 తర్వాత అత్యంత తక్కువ శాతం. తమకు మార్కులు తగ్గాయని భావించిన 11 లక్షల మంది విద్యార్థులు తమ ఆన్సర్‌షీట్ స్కాన్డ్ కాపీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సార్థక్ కూడా ఉన్నాడు. అయితే, బోర్డు పంపిన స్కాన్డ్ కాపీలు అస్పష్టంగా ఉండటం, జవాబులు సరిగ్గా కనిపించకపోవడం గమనించారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టిన ‘ఓఎస్‌ఎమ్’ (ఆన్ స్క్రీన్ మార్కింగ్ - జవాబు పత్రాలను ఆన్‌లైన్‌లో స్కాన్ చేసి దిద్దే విధానం) లోనే ఏదో లోపం ఉందని సార్థక్ గట్టిగా అనుమానించాడు.
సార్థక్ తన పరిశోధనను ‘ఓఎస్‌ఎమ్’ టెండర్ దక్కించుకున్న సంస్థపైకి మళ్లించాడు. ఆ పనులను ‘కోఎంప్ట్ ఎడ్యుటెక్’ అనే సంస్థకు అప్పగించినట్లు గుర్తించాడు. ఇదే సంస్థ 2019లో ‘గ్లోబరీనా’ పేరుతో తెలంగాణ ఇంటర్ ఫలితాల బాధ్యతలు తీసుకున్నప్పుడు భారీ గందరగోళం జరిగి, 23 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు దారితీసిన విషయాన్ని అతను వెలికితీశాడు. అంతటి వివాదాస్పద సంస్థకు సీబీఎస్‌ఈ ఎందుకు టెండర్ ఇచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. ఆ సంస్థకు పనులు కట్టబెట్టడం కోసం సీబీఎస్‌ఈ తన మూడు టెండర్లలో ఏకంగా 15 నిబంధనలను మార్చివేసిందని ఆధారాలతో సహా కనుగొన్నాడు. ఈ వివరాలతో మే 24న సంజయ్ మౌర్య పత్రికలో కథనం రాయగా, సార్థక్ తన బ్లాగ్‌లో సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా పూసగుచ్చినట్లు వివరించాడు.
ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, జూన్ 2న విద్యా వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సార్థక్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. కమిటీ ముందు హాజరైన ఈ జెన్‌జీ కుర్రాడు.. టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలను గంటపాటు వివరిస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశాడు. అక్కడే ఉన్న సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ను ఎంపీలు ప్రశ్నించగా.. తాము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా లేమని చేతులెత్తేశారు. దీని తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం.. అదే రోజు సాయంత్రం సీబీఎస్‌ఈ ఛైర్మన్‌తో పాటు సెక్రటరీని పదవుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిన్నమొన్ననే 12వ తరగతి పూర్తి చేసిన ఒక సాధారణ కుర్రాడు.. వ్యవస్థలోని లోపాలపై ‘తీగ లాగితే డొంక కదిలినట్లు’ దేశ విద్యా వ్యవస్థలోనే ప్రక్షాళనకు కారణమయ్యాడు.
Follow Us