/rtv/media/media_files/2026/02/09/pubg-2026-02-09-19-41-56.jpg)
ఆన్లైన్ గేమింగ్ వ్యసనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనే ఓ హెచ్చరిక. మీరట్ పరిధిలోని ఖైర్‌నగర్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ అనే యువకుడు తన ఆఫీసులో కూర్చుని ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు. ఆటలో లీనమైపోయిన సమయంలో అతనికి ఒక్కసారిగా బీపీ విపరీతంగా పెరిగిపోయింది. వైద్యుల సమాచారం ప్రకారం ఆ సమయంలో అతని బీపీ ఏకంగా 300mmHg కి చేరింది. దీంతో మెదడులో నరాలు తెగిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి, ఆ తర్వాత ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కైఫ్ మరణించాడు. కైఫ్‌కు పదేళ్ల క్రితమే బీపీ సమస్య మొదలైందని, అప్పటి నుంచి అతను చికిత్స పొందుతున్నాడని అతని తండ్రి మహ్మద్ ఫారూక్ తెలిపారు. కైఫ్ ఎప్పుడూ ఫోన్‌తోనే గడిపేవాడని, సోషల్ మీడియా రీల్స్ చేయడం, ఆన్లైన్ గేమ్‌లు ఆడటం అతనికి వ్యసనంగా మారిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ వాడకం తగ్గించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా అతను వినేవాడు కాదని, ఆ మొండితనమే ఇప్పుడు అతని ప్రాణం తీసిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై
ఈ మధ్య కాలంలో యువత స్మార్ట్ఫోన్లకు, ఆన్లైన్ గేమ్‌లకు బానిసలై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. గత వారమే ఘజియాబాద్‌లో ముగ్గురు చిన్నపిల్లలు ఆన్లైన్ గేమ్‌ల కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే ఈ ఉదంతం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గంటల తరబడి ఫోన్ వాడటం వల్ల ఒత్తిడి పెరిగి, ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Follow Us