Bihar : హ్యాట్సాఫ్ : ఆక్సిజన్ మాస్క్ తీసేసి మరీ... 20 మంది ప్రాణాలు కాపాడిన 95 ఏళ్ల బామ్మ!

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న ప్రసాద్ హాస్పిటల్లో నిన్న రాత్రి ఒక ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని ఐసీయూ లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
icu women

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో ఉన్న ప్రసాద్ హాస్పిటల్లో నిన్న రాత్రి ఒక ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రిలోని ఐసీయూ లో చికిత్స పొందుతున్న నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రి భవనంలోని ఐదో అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డులో ఈ మంటలు అంటుకున్నాయి. అక్కడ తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో చాలామంది ఆక్సిజన్ సపోర్ట్‌పై ఉన్నారు. మంటలు వ్యాపించిన వెంటనే ఐసీయూ మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో అక్కడ ఉన్న రోగులకు ఊపిరాడక ఊపిరిత్తిత్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ముజఫర్‌పూర్ ఎస్ఎస్‌పీ కాంతేష్ కుమార్ ఈ ప్రమాదంలో నలుగురు రోగులు చనిపోయినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఐసీయూలో ఉన్న మిగతా రోగులను వేరే ఆసుపత్రులకు తరలించారు.

బామ్మ గనుక మేల్కొనకపోయి ఉంటే

అక్కడ ఐసీయూలో ఎంత భయంకరంగా మంటలు చెలరేగాయో ఆసుపత్రి లోపలి దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. మంటల ధాటికి ఐసీయూలోని బెడ్లు, వైద్య పరికరాలు, మిగతా సామాన్లు అన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే, అక్కడ సమయానికి ఒక 95 ఏళ్ల బామ్మ గనుక మేల్కొనకపోయి ఉంటే ఈ ప్రమాదంలో ఇంకా చాలామంది రోగులు చనిపోయి ఉండేవారు. మంటలు అంటుకున్న అదే ఐసీయూ వార్డులో ఈ 95 ఏళ్ల వృద్ధురాలు కూడా చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో పొగలు అలుముకోవడం చూసిన ఈ బామ్మ, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తన ముఖానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్‌ను తనే స్వయంగా తీసేశారు. వెంటనే బెడ్ మీద నుంచి లేచి బయటకు పరిగెత్తారు. అక్కడే ఉన్న నర్సు దగ్గరకు వెళ్లి ఐసీయూలో మంటలు అంటుకున్నాయని సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, లోపల ఉన్న రోగులను బయటకు తీసుకురావడం ప్రారంభించారు. అలాగే వెంటనే ఫైర్ బ్రిగేడ్‌కు కూడా ఫోన్ చేశారు.

ఈ ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఆ 95 ఏళ్ల వృద్ధురాలు ముజఫర్‌పూర్‌లోని ఛప్రా మేఘ్ ప్రాంతానికి చెందిన రాధా దేవి. బ్లడ్ ప్రెషర్,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదం గురించి రాధా దేవి మాట్లాడుతూ, మంటలు అంటుకోగానే చుట్టూ అంతా చీకటిగా మారిపోయిందని చెప్పారు. అస్సలు మంటలు ఎలా అంటుకున్నాయో తనకు తెలియదని, అయితే పొగ రావడం చూడగానే తాను వెంటనే బయటకు వచ్చేసి అక్కడ ఉన్న నర్సుకు చెప్పానని, ఆ తర్వాతే నర్సు లోపలికి వెళ్లి చూశారని ఆమె వివరించారు.

Advertisment
తాజా కథనాలు