Kalita Majhi : పనిమనిషి టూ మినిస్టర్..  బెంగాల్ మంత్రి కలితా మాఝీ సక్సెస్ స్టోరీ ఇదే!

వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్నటివరకు ఇళ్లల్లో గిన్నెలు కడుగుతూ, ఊడుస్తూ నెలకు కేవలం రూ. 2,500 సంపాదించిన కలితా మాఝీ అనే సాధారణ మహిళ, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

New Update
bjp

వెస్ట్ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొన్నటివరకు ఇళ్లల్లో గిన్నెలు కడుగుతూ, ఊడుస్తూ నెలకు కేవలం రూ. 2,500 సంపాదించిన కలితా మాఝీ అనే సాధారణ మహిళ, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఔస్ గ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచిన ఆమె, నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో కొత్తగా చేరిన 35 మంది మంత్రులతో పాటు ఆమె కూడా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బెంగాల్ ప్రభుత్వంలో మొత్తం మంత్రుల సంఖ్య 41కి చేరింది.

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కలితా మాఝీ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీ తనను ఈ స్థాయికి తీసుకువస్తారని తానెప్పుడూ ఊహించలేదని, ఒక ఎమ్మెల్యే అవుతాననే నమ్మకమే లేని తనకు.. ఏకంగా మంత్రి పదవి దక్కడం నమ్మలేకపోతున్నానని సంతోషం వ్యక్తం చేశారు. 2014 నుండి తాను బీజేపీలో సాధారణ కార్యకర్తగా పనిచేస్తున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కేవలం తన నియోజకవర్గం గురించే ఆలోచించేదాన్నని, కానీ ఇప్పుడు ఒక మంత్రిగా మొత్తం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బాధ్యత తన భుజాలపై పడిందని ఆమె అన్నారు.  కలితా మాఝీకు ఇంకా శాఖను కేటాయించలేదు. 

ఎంతో మందికి స్ఫూర్తిదాయకం

కలితా మాఝీ జీవిత ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె చిన్నప్పుడే చదువును ఆపేయాల్సి వచ్చింది. కుటుంబాన్ని పోషించడం కోసం ఆమె చాలా ఇళ్లల్లో పనుల మనిషిగా  పనిచేశారు. ఆమె భర్త ప్లంబర్‌గా పనిచేస్తూ ఇల్లు గడుపుతుండగా, వారి కుమారుడు పార్థ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు.

రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో కలితా మాఝీ కేవలం బూత్ స్థాయి కార్యకర్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె కష్టాన్ని గుర్తించిన బీజేపీ.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయినప్పటికీ, అధైర్యపడకుండా ప్రజల్లోనే ఉన్నారు. దాంతో 2026 ఎన్నికల్లో పార్టీ ఆమెకు రెండోసారి అవకాశం ఇవ్వగా, ఈసారి ఆమె భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. 

Advertisment
తాజా కథనాలు