LPG Cylinder : గ్యాస్ సిలిండర్ల కొరత..క్యూలైన్ లో నిలబడి వ్యక్తి మృతి!

గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో గ్యాస్ కొరత వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఫరూఖాబాద్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది.

New Update
gas

గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్ర విషాదాన్ని నింపింది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ నగరాల్లో గ్యాస్ కొరత వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఫరూఖాబాద్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్ సరాయ్ వాటర్ ట్యాంక్ సమీపంలో ఉన్న భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఉదయం గ్యాస్ సిలిండర్ కోసం క్యూలైన్‌లో నిలబడిన 75 ఏళ్ల ముఖ్తార్ అన్సారీ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అక్కడున్న తోటి వినియోగదారులు ఆయనను కాపాడటానికి సిపిఆర్ చేసి, గుండెను పంప్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆయన ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. 

కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం, ముఖ్తార్ అన్సారీ ముందే గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నారు. శుక్రవారం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో ఆయన ఏజెన్సీకి చేరుకుని క్యూలైన్ లో నిలబడ్డారు. అయితే గంటల తరబడి వేచి చూడటంతో ఆయన ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. అక్కడి వారు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు వచ్చి ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. అన్సారీ మరణంతో ఆయన కుటుంబంలో పెను విషాదం నెలకొంది.

గత్యంతరం లేక ఆయనే స్వయంగా

మృతుడు అన్సారీ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.  అయినప్పటికీ ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ పూర్తిగా అయిపోవడంతో, గత్యంతరం లేక ఆయనే స్వయంగా ఉదయాన్నే లైన్‌లో నిలబడాల్సి వచ్చిందన్నారు.  అంతకుముందు ఎప్పుడూ ఇలాంటి గ్యాస్ కొరత ఎదుర్కోలేదని, కానీ ఇప్పుడు బుకింగ్ చేసుకున్న తర్వాత కూడా సిలిండర్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. ఇటీవల పంజాబ్‌లోని బర్నాలాలో కూడా సిలిండర్ కోసం లైన్‌లో నిలబడిన 66 ఏళ్ల భూషణ్ కుమార్ మిట్టల్ గుండెపోటుతో మరణించారు. గ్యాస్ కొరత కారణంగా ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక అధికారులు పరిస్థితి సాధారణంగానే ఉందని చెబుతున్నప్పటికీ, గ్యాస్ ఏజెన్సీల వద్ద కనిపిస్తున్న భారీ క్యూలైన్లు,  సరఫరాలో ఇబ్బందులు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు