Lokayukta raids : కుట్లు, అల్లికలతో రూ.11 కోట్లు సంపాదన... లోకాయుక్త సోదాల్లో  ప్రభుత్వ అధికారి వింత సమాధానం!

మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చెందిన భారీ అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే తన భార్య కుట్టు మిషన్ నడుపుతూ, బట్టల అల్లికల పని చేస్తూ ఆ రూ.11 కోట్లు సంపాదించిందని ఆయన చెప్పడం గమనార్హం.

New Update
FotoJet - 2026-06-11T213833.883

Lokayukta raids

Lokayukta raids : మధ్యప్రదేశ్‌లో అవినీతి నిరోధక సంస్థ లోకాయుక్త నిర్వహించిన సోదాల్లో ఓ ప్రభుత్వ ఉన్నతాధికారికి చెందిన భారీ అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ తనిఖీల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఆసక్తికర పరిణామం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోదాల్లో దొరికిన కోట్లాది రూపాయల ఆస్తులపై దర్యాప్తు అధికారులు సదరు అధికారిని ప్రశ్నించగా, ఆయన ఇచ్చిన సమాధానం విని అధికారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. తన భార్య కుట్టు మిషన్ నడుపుతూ, బట్టల అల్లికల పని చేస్తూ ఆ రూ.11 కోట్లు సంపాదించిందని ఆయన చెప్పడం గమనార్హం.

రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ్ కంద్వాల్ (Lakshminarayan Kandwal) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇందౌర్‌లోని ఆయన నివాసంతో పాటు, ఆయనకు సంబంధించిన వ్యాపార సంస్థలు, ఇతర ప్రాంగణాలపై లోకాయుక్త పోలీసులు బుధవారం (జూన్ 10) ఉదయం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. 1996 నుండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న కంద్వాల్‌కు వచ్చిన మొత్తం జీతభత్యాలు సుమారు రూ.2.5 కోట్లు కాగా, ఆయనకున్న వ్యవసాయ వనరుల రాబడి అంతా కలిపినా చట్టబద్ధమైన ఆదాయం రూ.2.8 కోట్లు మాత్రమే ఉండాలని అధికారులు అంచనా వేశారు. కానీ, సోదాల్లో మాత్రం ఏకంగా రూ.10.83 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు ఉన్నట్లు లెక్కగట్టారు.

లోకాయుక్త పోలీసుల తనిఖీల్లో కంద్వాల్‌కు సంబంధించిన ఒక విలాసవంతమైన భారీ భవనం, పలు ఓపెన్ ప్లాట్లు, ఒక డిపార్ట్‌మెంటల్ స్టోర్, అధునాతన జిమ్ (Gym) కి సంబంధించిన ఆస్తులు బయటపడ్డాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున నగదు, బంగారం, వెండి ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం ఆయన ఇంట్లో ఉన్న విలాసవంతమైన వస్తువుల విలువే దాదాపు రూ.38.49 లక్షలుగా తేలింది. అలాగే, వారి బ్యాంక్ లాకర్లను తెరిచి చూడగా అందులో లభించిన బంగారం, వెండి ఆభరణాల విలువ రూ.24.76 లక్షలుగా అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇంత భారీ మొత్తంలో ఆస్తులు ఎలా వచ్చాయని అధికారులు నిలదీయగా.. తన భార్య గృహిణి అయినప్పటికీ, ఇంట్లోనే కుట్టు మిషన్ కుడుతూ, అల్లిక పనులు చేస్తూ ఈ సంపదనంతా పోగుచేసిందని కంద్వాల్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఒక సాధారణ కుట్టు పని ద్వారా రూ.11 కోట్లు సంపాదించడం సాధ్యమేనా అని అధికారులు ముక్కున వేలేసుకున్నారు.

ఈ భారీ అవినీతి తిమింగలంపై లోకాయుక్త పోలీసులు ప్రస్తుతం చట్టపరమైన చర్యలను వేగవంతం చేశారు. కంద్వాల్ కుటుంబ సభ్యుల పేరిట ఉన్న అన్ని బ్యాంక్ అకౌంట్లను, లాకర్లను అధికారులు ఇప్పటికే స్తంభింపజేశారు (Freeze). ఆయా బ్యాంకుల నుంచి పూర్తి ఆర్థిక లావాదేవీల వివరాలు అందిన తర్వాత, ఆయన అక్రమ ఆస్తుల మొత్తం విలువ మరికొంత పెరిగే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, అవినీతి ఆరోపణల్లో అడ్డంగా దొరికిపోయిన జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ్ కంద్వాల్, మరో ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ (Retirement) చేయాల్సి ఉండడం విశేషం. పక్కా ప్లాన్‌తో పదవీ విరమణకు ముందే లోకాయుక్త అధికారులు ఈ అవినీతి నెట్‌వర్క్‌ను ఛేదించారు.

Advertisment
తాజా కథనాలు