TN Elections: తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకే పొత్తు ఫైనల్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లో తెలుసా?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది.

New Update
kharge

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార డీఎంకే, కాంగ్రెస్ మధ్య నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య అధికారికంగా ఒప్పందం కుదిరింది. బుధవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో ఫోన్‌ ద్వారా చర్చలు జరిపి తుది నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 28 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. తొలుత కాంగ్రెస్ 35 సీట్లు కావాలని పట్టుబట్టగా, డీఎంకే మాత్రం 25 కంటే ఎక్కువ ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. దీనివల్ల గత కొద్ది రోజులుగా ఇరు పార్టీల మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. అయితే ఖర్గే నేరుగా స్టాలిన్‌తో మాట్లాడి ఈ సందిగ్ధతను తొలగించారు. 28 అసెంబ్లీ స్థానాలతో పాటు, ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు డీఎంకే అంగీకరించింది.

చిదంబరం కీలక పాత్ర

సీట్ల పంపకాల ప్రక్రియలో సీనియర్ నాయకుడు పి. చిదంబరం కీలక పాత్ర పోషించారు. ఆయన స్టాలిన్‌తో పాటుగా డీఎంకే ఇతర అగ్రనేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ మొదట్లో ఏకాభిప్రాయం కుదరలేదు. చివరకు ఏఐసీసీ జోక్యంతో ఖర్గే స్వయంగా రంగంలోకి దిగి సీట్ల సంఖ్యను 28 వద్ద ఖరారు చేశారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కాంగ్రెస్‌కు 25 స్థానాలు ఇవ్వగా, అందులో 18 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఈసారి మరింత మెరుగైన స్థానాలు కోరుతూ కాంగ్రెస్ 35 సీట్లు, 2 రాజ్యసభ సీట్లు డిమాండ్ చేసినప్పటికీ, కూటమిలోని ఇతర పార్టీల సమీకరణాల దృష్ట్యా డీఎంకే 28 సీట్లకే పరిమితం చేసింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో తమిళనాడు ఎన్నికల బరిలో విపక్షాల కంటే ముందే అధికార కూటమి తమ సీట్ల పంపకాలను పూర్తి చేసుకుని ప్రచారానికి సిద్ధమవుతోంది. దీనిపై త్వరలోనే ఉమ్మడి విలేకరుల సమావేశం ద్వారా అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisment
తాజా కథనాలు