Digital Census 2027: డిజిటల్ జనాభా లెక్కలు.. సెన్సస్-2027 షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన జనాభా లెక్కల సేకరణ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు.

New Update
_ Digital Census

భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన జనాభా లెక్కల సేకరణ (సెన్సస్-2027) ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్యుమరేషన్ ప్రక్రియను ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నాలుగు అత్యాధునిక యాప్‌లు, పోర్టల్స్‌తో పాటు ‘ప్రగతి’, ‘వికాస్’ అనే మస్కట్‌లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీలో గురువారం ఆవిష్కరించారు.

టెక్నాలజీతో జనాభా లెక్కలు 
ఈ బృహత్తర కార్యక్రమం కోసం సుమారు 30 లక్షల మంది సిబ్బందిని రంగంలోకి దించుతున్నారు. సి-డాక్ (C-DAC) ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక యాప్‌ల ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా డేటాను సేకరించే వీలుంటుంది. ఈసారి ప్రధాన ఆకర్షణ ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (స్వీయ నమోదు). ఎన్యుమరేటర్లు ఇంటికి రాకముందే, ప్రజలు తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారా 16 ప్రాంతీయ భాషల్లో తమ కుటుంబ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న తర్వాత వచ్చే ప్రత్యేక ఐడీని సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది.

లింగ సమానత్వాన్ని చాటిచెబుతూ, మహిళా ఎన్యుమరేటర్‌ను ‘ప్రగతి’గా, పురుష ఎన్యుమరేటర్‌ను ‘వికాస్’గా నామకరణం చేస్తూ మస్కట్‌లను విడుదల చేశారు. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ జనగణన కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.

ప్రధాన డిజిటల్ సాధనాలు:
హౌస్‌లిస్టింగ్ వెబ్ యాప్: శాటిలైట్ మ్యాప్‌ల ద్వారా భౌగోళిక బ్లాక్‌ల రూపకల్పనకు.
హెచ్‌ఎల్ఓ యాప్: ఎన్యుమరేటర్లు నేరుగా డేటాను సర్వర్‌కు పంపేందుకు.
ఎస్‌ఈ పోర్టల్: ప్రజలు నేరుగా వివరాలు నమోదు చేసుకునే స్వీయ నమోదు పోర్టల్.
సెన్సస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్: అధికారులు రియల్-టైమ్‌లో పురోగతిని పర్యవేక్షించే డ్యాష్‌బోర్డ్.

షెడ్యూల్ మరియు కులగణన:
ఈ ప్రక్రియ రెండు దశల్లో జరగనుంది:

మొదటి దశ (ఏప్రిల్ 1 - సెప్టెంబర్ 30, 2026): ఇళ్ల వివరాల సేకరణ (హౌస్ లిస్టింగ్).
రెండో దశ (ఫిబ్రవరి 2027): వ్యక్తుల వివరాల సేకరణ. విశేషమేమిటంటే, ఈ దశలోనే కులగణన వివరాలను కూడా సేకరించనున్నారు.

మంచు ప్రభావం ఉండే హిమాలయ ప్రాంతాల్లో 2026 సెప్టెంబర్‌కల్లా సర్వే పూర్తి చేస్తారు. మిగిలిన దేశమంతటా 2027 మార్చి 1వ తేదీని ప్రామాణికంగా తీసుకుని జనాభా గణనను పూర్తి చేయనున్నారు.

Advertisment
తాజా కథనాలు