Ganapathi's surrender : రేపటితో ముగియనున్న డెడ్‌లైన్‌...గణపతి లొంగుబాటుపై వీడని సస్పెన్స్‌

దేశంలో మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గడువు రేపటితో ముగియనుంది. కానీ, మావోయిస్టు అగ్రనేత  ముప్పాళ్ల  లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు.

New Update
FotoJet (2)

Maoist top leader Ganapathi surrenders?

Ganapathi's surrender : దేశంలో మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రకటించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గడువు రేపటితో ముగియనుంది. కానీ, మావోయిస్టు అగ్రనేత  ముప్పాళ్ల  లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఆయనతో పాటు తెలంగాణకు చెందిన మరో ఆరుగురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతల ద్వారా గణపతి లొంగుబాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే ఆయన ఆచూకీ మాత్రం ఇంకా తెలియలేదని పోలీసులు అంటున్నారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన లొంగిపోతే ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందిస్తుందని పోలీసులు చెబుతున్నారు.

నేపాల్‌ టు ఫిలిప్పీన్స్

లొంగిపోయిన మావోయిస్టు నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 2018లో ప్రధానకార్యదర్శి బాధ్యతలనుంచి తప్పుకున్న తర్వాత కొంతకాలం దండకారణ్యంలోనే ఉన్నారని, పార్టీకి అవసరమైన సలహాలు, సూచనలు అందించారని చెబుతున్నారు. అయితే పోలీసుల నిర్భంధం పెరగడం, ఆయన వయసు మీదపడటంతో ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి నెలకొనడంతో ఆయనను సాయుధ మావోయిస్టుల రక్షణలో నేపాల్‌ తరలించారని తెలుస్తోంది. ఆయనతో పాటు కొంతమంది ఆయనకు అవసరమైన సఫర్యలు చేయడానికి కూడా ఆయనతో వెళ్లినట్లు చెబుతున్నారు. గణపతి అక్కడి నుంచే పార్టీ నాయకులకు అవసరమైన సలహాలు అందిస్తూ వచ్చారని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి ఫిలిప్పీన్స్ వెళ్లారని ప్రచారం సాగుతోంది.

\వరుస లొంగుబాట్లు

నిజానికి గత ఏడాదిన్నర కాలంలో మావోయిస్టు పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన ఆఫరేషన్‌ కగార్‌తో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అనేక వందల మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో మృతి చెందారు. గణపతి తర్వాత ప్రధానకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్న నంబాల కేశవరావు కూడా ఎన్‌ కౌంటర్‌లో మృతి చెందాడు. ఆయన తర్వాత వరుసగా అగ్ర నాయకత్వంలో ముఖ్యమైన నేతలంతా మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టు పార్టీ కోలోకోలేని దెబ్బతింది. ఈ క్రమంలోనే లొంగుబాట్లు మొదలయ్యాయి. కేంద్ర కమిటీ నాయకులు మల్లోజుల వేణుగోపాల్‌, ఆశన్న తదితరులు పెద్ద ఎత్తున సహాచరులు, ఆయుధాలతో పాటు లొంగిపోయారు. అది పార్టీని మరింత బలహీనపరిచింది. ఈ క్రమంలోనే కేంద్ర కమిటీ నాయకులు దేవ్‌‌జీ అలియాస్‌‌ తిప్పిరి తిరుపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్‌‌ సంగ్రామ్‌‌, దామోదర్‌‌,‌‌ చంద్రన్న సహా పలువురు కీలక నేతలు నెలల వ్యవధిలోనే లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఏపీకి చెందిన మావోయిస్టు నేత చెల్లూరు నారాయణరావు అలియాస్ సోమన్న కూడా లొంగిపోయారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే గణపతి పాటు మరో ఆరుగురు మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని చెబుతున్నారు. ఇపుడు వారి లొంగుబాటుతో మావోయిస్టులు లేని తెలంగాణ గా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.

అజ్ఞాతంలో ఉన్నది వీరే

గణపతి, ఆయన భార్య జోడే రత్నాబాయి, సికింద్రాబాద్‌‌కు చెందిన వార్త శేఖర్, హనుమకొండ జిల్లా సోమిడికి చెందిన పసునూరి నరహరి అలియాస్ సంతోష్ ,  సిద్దిపేట జిల్లా మిర్దొడ్డికి చెందిన రంగబోయిన భాగ్య,  హైదరాబాద్‌‌ కు చెందిన నక్క సుశీల అలియాస్ రేల,  భదాద్రి జిల్లా తడపలకు చెందిన కుంజం ఇడ్మల్‌‌ మాత్రమే అజ్ఞాతంలో మిగిలి ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు.  వీరంతా లొంగిపోవాలని కోరుతున్నారు.

రేపు రాష్ట్రంలో కీలక పరిణామం

కేంద్రం పెట్టిన వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు చివరిగడువు రేపటితో ముగియనుంది.ఈ క్రమంలో రాష్ర్టంలో రేపు కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న అగ్రనేత ముప్పాళ్ల  లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఆరుగురు మావోయిస్టు నేతలు రేపు ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోతారని ప్రచారం సాగుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఇంటెలిజెన్స్‌‌, ఎస్‌‌ఐబీ అధికారులు లొంగిపోయిన మావోయిస్టు నేతలతో కలిసి గణపతితో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గణపతి లొంగుబాటును కేంద్రం నుంచి ఇద్దరు స్పెషల్ ఆఫీసర్లు పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు.

చివరి రోజు దాటితే...

కేంద్రం లెక్కల ప్రకారం ఈ నెల 31న మావోయిస్టులకు ‘డెడ్‌‌’లైన్‌‌ పూర్తవుతుంది. ఈ క్రమంలో గణపతి లొంగుబాటుపై ఉత్కంఠ నెలకొంది. ఆయనను లొంగిపోయేలా ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం పెట్టిన  డెడ్‌లైన్‌ రేపటితో ముగుస్తోంది. ఈ క్రమంలో అజ్ఞాతం వీడిన మావోయిస్టులు ప్రభుత్వం వద్ద కొత్త ప్రతిపాదన తీసుకువచ్చారు. తామంతా ఇక మీదట జనంలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తామని చెబుతున్నారు. దీనికోసం పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్నారు. అలా చేస్తే సీపీఐ మావోయిస్టు పార్టీ రాజకీయ పార్టీగా అవతరించే అవకాశం ఉంది. అదే జరిగితే మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉంది. మావోయిస్టుల మీద నిషేధం ఎత్తివేయడం వల్ల ఒకవేళ వారు పట్టుబడ్డ ఎన్‌ కౌంటర్‌ చేసే అవకాశం ఉండదని భావిస్తున్నారు. దీంతో డెడ్‌లైన్‌తో సంబంధం లేకుండా మావోయిస్టుల లొంగుబాటుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు