TVK Vijay : ఢిల్లీ పెద్దల సభలోకి ‘దళపతి’ విజయ్ ఎంట్రీ?

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా, ఇటీవల తమిళనాడులో అధికారంలోకి వచ్చిన నటుడు, సీఎం విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) రాజ్య సభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.

New Update
tvk

Tamil Nadu Vijay TVK Rajya Sabha Entry

TVK Vijay : భారత రాజకీయాల్లో మరో ఆసక్తికర అంకానికి తెర లేచింది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలు కేవలం సంఖ్యాబలాన్ని మార్చడమే కాకుండా, దక్షిణాది రాజకీయాల్లో, ముఖ్యంగా తమిళనాడులో సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతున్నాయి. ఇటీవల తమిళనాడులో అధికారంలోకి వచ్చిన నటుడు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (TVK) త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలోని పెద్దల సభలోనూ అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
 
రాజ్యసభ ఎన్నికల తర్వాత పార్టీల బలాబలాల్లో చోటుచేసుకోబోయే మార్పులను పరిశీలిస్తే.. మొత్తం 26 స్థానాలకు జరుగుతున్న ఈ పోరులో అధికార ఎన్డీయే (NDA) కూటమి ప్రస్తుతం ఉన్న 18 స్థానాల నుండి ఒక సీటును కోల్పోయి 17 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (INC) తన బలాన్ని 4 నుండి 5 స్థానాలకు పెంచుకోనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారడంతో ప్రస్తుతం 3 స్థానాలు కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఈ ఎన్నికల తర్వాత ఆ మూడింటినీ కోల్పోయి పూర్తిగా నష్టపోనుంది. జార్ఖాండ్‌లో బలంగా ఉన్న జార్ఖాండ్ ముక్తిమోర్చా (JMM) తన స్థానాన్ని 1 నుండి 2కు పెంచుకునే పొజిషన్‌లో ఉంది. ఇక ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీతో పాటు, మహారాష్ట్రకు చెందిన ఎన్‌సీపీ (NCP - అజిత్ పవార్ వర్గం) చెరో ఒక స్థానాన్ని గెలుచుకుని, సరికొత్తగా పెద్దల సభలోకి (రాజ్యసభ) అడుగుపెట్టబోతున్నాయి.

తమిళనాడులో 'టీవీకే' సరికొత్త రికార్డు!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయంతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న విజయ్ (TVK), ఇప్పుడు కేంద్ర రాజకీయాలపై కన్నేసింది. తమిళనాడు నుంచి ఖాళీ అవుతున్న ఏకైక రాజ్యసభ స్థానాన్ని టీవీకే కైవసం చేసుకోనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మరోవైపు, ప్రతిపక్షాల 'ఇండియా' కూటమి నుంచి డీఎంకే (DMK) వైదొలగడంతో పార్లమెంట్‌లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుత రాజ్యసభ బలాబలాల ప్రకారం.. మొత్తం 244 స్థానాల్లో ఎన్డీయేకు 149 మంది ఎంపీల బలం ఉండగా, విపక్షాలకు 78 సీట్లు ఉన్నాయి. మిగిలిన 17 సీట్లు తటస్థ లేదా ప్రాంతీయ పార్టీల చేతుల్లో ఉన్నాయి.


 ఆంధ్రప్రదేశ్ (4 సీట్లు)

ఏపీలో రాజకీయం పూర్తిగా ఏకపక్షం కానుంది. ఖాళీ అవుతున్న 4 స్థానాలూ అధికార తెలుగుదేశం పార్టీ (TDP) ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం 3 స్థానాలు కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఈ ఎన్నికల తర్వాత ఇక్కడ పూర్తిగా నష్టపోనుంది.

 కర్ణాటక (4 సీట్లు)

ఇక్కడ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంతో ఉంది. 4 సీట్లలో కాంగ్రెస్ 3 సీట్లు సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉండగా, బీజేపీ 1 సీటు దక్కించుకోనుంది.కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే రెండోసారి రాజ్యసభకు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.అయితే, పదవీకాలం ముగుస్తున్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడకు బీజేపీ మళ్లీ మద్దతిస్తుందా? లేక సొంత అభ్యర్థిని నిలబెడుతుందా? అన్నది ఉత్కంఠగా మారింది.

గుజరాత్ (4 సీట్లు) - సరికొత్త రికార్డు

గుజరాత్‌లోని నాలుగు సీట్లనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. ఈ గెలుపుతో గుజరాత్ రాజకీయ చరిత్రలోనే మొదటిసారి రాజ్యసభలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా లేని పరిస్థితి తలెత్తబోతోంది.

మధ్యప్రదేశ్, రాజస్థాన్ (తలా 3 సీట్లు)

ఈ రెండు రాష్ట్రాల్లోనూ తలా 3 సీట్లు ఖాళీ అవుతుండగా, బల నిరూపణల ప్రకారం బీజేపీకి రెండేసి, కాంగ్రెస్‌కు ఒక్కో సీటు దక్కే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ నామినేషన్ వేస్తారనే ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పదవీకాలం ముగియనుంది.

జార్ఖాండ్ (2 సీట్లు)

జార్ఖాండ్‌లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి బలంగా ఉండటంతో రెండు సీట్లూ ఆ కూటమికే దక్కేలా ఉన్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నుంచి ఒక సీటును కాంగ్రెస్ ఆశిస్తోంది. అయితే, ఇక్కడ బీజేపీ కూడా అభ్యర్థిని రంగంలోకి దించి, బీహార్ తరహాలో 'క్రాస్ ఓటింగ్' ద్వారా లబ్ధి పొందాలని వ్యూహాలు రచిస్తోంది.

కేంద్ర మంత్రులకు అగ్నిపరీక్ష!

ఈ ఎన్నికలు ఇద్దరు కేంద్ర మంత్రులకు అత్యంత కీలకం. బీజేపీ మంత్రులైన రవ్నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్లను ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిపించుకోవాల్సి ఉంది. ముఖ్యంగా వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రవ్నీత్ సింగ్ బిట్టును రాజ్యసభకు పంపడం ద్వారా పంజాబ్‌లో పట్టు సాధించాలని బీజేపీ పట్టుదలతో ఉంది.

#tamil-nadu #rajya-sabha #tvk vijay #rajya sabha election #Rajya Sabha Entry
Advertisment
తాజా కథనాలు