అసెంబ్లీ ఎన్నికల ముందు వెస్ట్ బెంగాల్ గవర్నర్ రాజీనామా

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో ఉన్న ఆనంద బోస్, తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు.

New Update
_Ananda Bose resigns

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వారాల ముందు గవర్నర్ సి.వి. ఆనంద బోస్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో ఉన్న ఆనంద బోస్, తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. దాదాపు మూడేన్నర ఏళ్ల పాటు బెంగాల్ గవర్నర్‌గా సేవలు అందించిన ఆయన, తన రాజీనామాపై స్పందిస్తూ.. "గవర్నర్ కార్యాలయంలో నేను తగినంత సమయం గడిపాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని పేర్కొన్నారు. అయితే, ఎన్నికల ముందు ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వెనుక గల అసలు కారణాలను ఆయన స్పష్టం చేయలేదు.

మమతా బెనర్జీ స్పందన
గవర్నర్ రాజీనామాపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం 'X' వేదికగా స్పందిస్తూ, "గవర్నర్ ఆనంద బోస్ రాజీనామా వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన రాజీనామా వెనుక ఉన్న కారణాలు నాకు తెలియవు. కానీ, అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్ర హోం మంత్రి నుంచి ఆయనపై ఒత్తిడి వచ్చి ఉండవచ్చని నేను భావిస్తున్నాను" అని ఆరోపించారు.

కొత్త గవర్నర్‌గా ఆర్.ఎన్. రవి
ఆనంద బోస్ రాజీనామాను ఆమోదించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ కొత్త గవర్నర్‌గా ఆర్.ఎన్. రవిని నియమించినట్లు సమాచారం. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా ఉన్న ఆయనను బెంగాల్‌కు బదిలీ చేసినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనకు ఫోన్ ద్వారా తెలిపారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ నియామకంపై కూడా మమతా అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె విమర్శించారు.

Advertisment
తాజా కథనాలు