/rtv/media/media_files/2026/04/30/supreme-court-2026-04-30-14-44-30.jpg)
Supreme Court
పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తులు ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్నంత మాత్రాన వారి క్యారెక్టర్ బాలేదని, వారిది చెడ్డ ప్రవర్తన అని ముద్ర వేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ గాజుల తిరుపతి అనే యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించి ఈ కీలక తీర్పునిచ్చింది.
గాజుల తిరుపతి అనే యువకుడు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే, గతంలో అతనిపై ఒక క్రిమినల్ కేస్ ఉండటంతో బోర్డు అతని ఉద్యోగాన్ని రద్దు చేసింది. అతని ఇంటి పక్కన ఉండే ఒక యువతి.. తిరుపతి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్లు రిలేషన్‌లో ఉండి, ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదైనప్పటికీ, 2015లోనే లోక్ అదాలత్ ద్వారా ఇద్దరూ రాజీ పడ్డారు. దాంతో ఆ కేసు ముగిసిపోయింది.
తిరుపతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ కేసు వివరాలను దాచకుండా ఫారమ్‌లో నిజాయితీగా రాశాడు. అయినప్పటికీ, పోలీస్ బోర్డు మాత్రం "ఇది నైతిక ప్రవర్తనకు సంబంధించిన నేరం, కాబట్టి ఇతను పోలీస్ ఉద్యోగానికి పనికిరాడని అతని ఎంపికను రద్దు చేసింది. ఈ కేసును పరిశీలించిన సుప్రీంకోర్టు.. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది.
రిలేషన్‌లో ఉండటం సర్వసాధారణం
ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇద్దరు మేజర్లు ఇష్టపడి రిలేషన్‌లో ఉండటం సర్వసాధారణం. మన దేశంలో ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిసి ఉండటాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు. కేవలం ఆ కారణంతో ఒకరి క్యారెక్టర్ తప్పు అని చెప్పలేమని కోర్టు అభిప్రాయపడింది. ప్రేమించుకున్న ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారని గ్యారెంటీ లేదు. కొన్ని కారణాల వల్ల బ్రేకప్ అయితే.. ఒకరు మరొకరిని మోసం చేశారని బ్లేమ్ చేయలేం. ఇక్కడ అమ్మాయి కూడా ఎలాంటి బలవంతం లేదని, కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పినప్పుడు యువకుడిని తప్పుబట్టలేం అని వెల్లడించింది.
గతంలో గొడవలు, హింసకు సంబంధించిన కేసుల్లో రాజీ పడితే ఉద్యోగాలు నిరాకరించిన సందర్భాలు ఉన్నాయి కానీ, ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది. తిరుపతికి వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం ఇవ్వాలని హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన పాత తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Follow Us