/rtv/media/media_files/2026/05/12/wine-shops-2026-05-12-10-41-37.jpg)
Wine shops
Wine shops : తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ‘దళపతి’ విజయ్ సరికొత్త శకానికి నాంది పలికారు. ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే ప్రజల ఆరోగ్యం, మహిళలు, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన అత్యంత సాహసోపేతమైన, సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజలకు అసౌకర్యంగా ఉన్న 717 మద్యం (వైన్) షాపులను రాబోయే 2 వారాల్లోగా (14 రోజుల్లో) పూర్తిగా మూసివేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం రంగంపై, పదవిలోకి వచ్చిన మూడో రోజే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.తమిళనాడు సమాచార, పౌర సంబంధాల శాఖ (DIPR) వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం ఈ కఠిన నిబంధనను అమలు చేస్తోంది.పాఠశాలలు, కళాశాలలు (విద్యాసంస్థలు) గుళ్లు, మసీదులు, చర్చిలు (ప్రార్థనా స్థలాలు) ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే బస్టాండ్‌లు వంటి ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ ప్రాంతాల్లో మద్యం దుకాణాల వల్ల మహిళలు, విద్యార్థులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి విజయ్ తక్షణమే స్పందించి ఈ ఆదేశాలు ఇచ్చారు.
తమిళనాడులో మద్యం విక్రయాలన్నీ ప్రభుత్వ సంస్థ అయిన 'తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్' (TASMAC) ఆధ్వర్యంలోనే సాగుతాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 4,765 టాస్మాక్ రిటైల్ దుకాణాలు నడుస్తుండగా.. తాజా సర్వేలో నిబంధనలు ఉల్లంఘించిన 717 దుకాణాలను గుర్తించారు. కాగా మూసివేతకు గురవుతున్న వైన్స్ షాపుల్లో ప్రార్థనా స్థలాల సమీపంలో (గుళ్లు, మసీదులు, చర్చిలు)276, బస్టాండ్‌ల పరిసరాల్లో255, విద్యాసంస్థల దగ్గర (పాఠశాలలు, కళాశాలలు)186 షాపులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మొత్తం 717 వైన్స్ షాపులకు రెండు వారాల డెడ్ లైన్ విధించింది.
"ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. విద్యాసంస్థలు, దేవాలయాల వద్ద మద్యం విక్రయాలు జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అందుకే ఈ 717 దుకాణాలను రెండు వారాల్లోగా శాశ్వతంగా మూసివేయాలి" అని ముఖ్యమంత్రి ఎస్. జోసెఫ్ విజయ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించే బాధ్యతను ఎక్సైజ్ అధికారులకు అప్పగించారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు కొంత ఆదాయం తగ్గినప్పటికీ, సామాజిక భద్రతకే తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై క్షేత్రస్థాయిలో ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల వద్ద మద్యం దుకాణాలు తొలగించడం వల్ల చదువుకునే వాతావరణం మెరుగుపడుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. విజయ్ కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.మరోవైపు తమిళనాడులో జరిగిన ఈ మార్పు పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పలు విద్యాసంస్థలు, ప్రార్థన మందిరాలకు సమీపంలో మద్యం దుకాణాలు ఉండటం, స్కూళ్లు-కాలేజీల ముందే పాన్ షాపులు, ఈ-సిగరెట్ల విక్రయాలు సాగుతుండటంతో విద్యార్థులు పక్కదారులు పడుతున్నారని, అక్కడ కూడా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Follow Us