CJP protests : నీట్ వివాదంపై భాగ్యనగరంలో సీజేపీ నిరసన..విద్యాశాఖమంత్రి రాజీనామాకు డిమాండ్‌

సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్‌ఈ అక్రమాలపై సీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి

New Update
FotoJet - 2026-06-14T132335.710

CJP protests in Hyderabad

CJP protests : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్‌లో జరిగిన అక్రమాలపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనను జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ వేదికగా నిరసన జ్వాలలు మిన్నంటాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌ వద్ద ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఆధ్వర్యంలో భారీ శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేపర్‌ లీక్‌ పై సిజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నాయకత్వంలో దేశవ్యాప్త ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఢిల్లీ, లక్నోల తర్వాత హైదరాబాద్‌లో చేపట్టిన ఈ ధర్నాకు నగరంలోని విద్యార్థులు, యువత, విద్యావేత్తలు,వివిధ ప్రజాసంఘాలు భారీ సంఖ్యలో తరలిరావడంతో ధర్నా చౌక్ పరిసరాలన్నీ పోటెత్తాయి.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ విద్యావేత్త, మెగసేసే అవార్డు గ్రహీత సోనమ్ వాంగ్‌చుక్ మాట్లాడుతూ.. సిజేపీ అనేది కేవలం ఒక రాజకీయ వేదిక కాదని, ప్రతి భారతీయుడిని మేల్కొలపడమే దీని ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రధానమంత్రితో సహా ప్రతి ఒక్కరూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. పౌరులు తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలన్నారు. కేబీఆర్ పార్కు పరిరక్షణ కోసం పర్యావరణ సమస్యలపై గళం విప్పుతున్న హైదరాబాద్ ప్రజలను చూసి తాను గర్వపడుతున్నానని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అలాగే, నీట్ పేపర్ లీక్ వివాదం తదనంతర పరిణామాలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్న ఆకాంక్ష చతుర్వేది, ప్రదీప్ వంటి ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఉదంతాలను ఆయన గుర్తుచేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. రూ. 3 లక్షలు అప్పుచేసి చదివిస్తున్న తండ్రికి "నేను డాక్టర్ అయ్యాక మన కష్టాలన్నీ తీరుస్తా" అని భరోసానిచ్చిన ఆకాంక్ష, లీకేజీ వార్తలతో ఆవేదన చెంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు.

ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పరీక్షా పత్రాల లీకేజీ వివాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో భారీ రైలు ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యతతో రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రిని ఆయన ఈ సందర్భంగా ఉదాహరణగా గుర్తుచేశారు. దేశంలో గత కొన్ని నెలలుగా పేపర్లు లీక్ అవుతున్నా కేంద్ర మంత్రి ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. "ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఆ కుర్చీలో మేమేమీ కూర్చోం" అని వ్యాఖ్యానించిన ఆయన, దేశంలో ఏ సమస్య వచ్చినా దాటవేసే ధోరణి పెరిగిపోయిందని మండిపడ్డారు. ఉల్లిగడ్డ రేటు పెరిగితే ఉల్లిగడ్డ తినొద్దని, పెట్రోల్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దని చెప్తున్నారని, అత్యాచారాలు జరిగితే రాత్రిపూట బయటకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం ప్రశ్నిస్తే 'అర్బన్ నక్సలైట్', 'దేశద్రోహి', 'పాకిస్తాన్ వాడు' అంటూ ముద్రలు వేస్తున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో ప్రారంభమైన ఈ యువత ఆవేశం ఇప్పుడు స్ట్రీట్ ఫైట్ (రోడ్డుపై పోరాటం) వరకు వచ్చిందని, మీడియా, రాజకీయం మీ చేతుల్లో ఉండొచ్చు కానీ 'జనాగ్రహాన్ని' మీరు చేతుల్లో పెట్టుకోలేరని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

తెలంగాణ మాజీ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కేంద్ర ప్రభుత్వ విద్యా విధానాలపై, ప్రధాని మోదీ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దుర్మార్గపు పరిపాలన చేస్తూ ప్రతి ఏటా విద్యార్థులను మోసం చేస్తున్నారని, పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని సన్యాసులు దేశాన్ని పాలిస్తున్నారని తీవ్ర పదజాలంతో విమర్శించారు. ప్రతి సంవత్సరం లీకులు కావడానికి క్యాబినెట్ లంచగొండితనమే కారణమని, ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు ప్రతి దేశద్రోహిని మోదీ కాపాడుతున్నాడని ఆరోపించారు. 12 ఏళ్ల మోదీ పాలన బ్రహ్మాండంగా ఉందని భక్తులు చెబుతున్నారని, కానీ ఈ పాలనలో పేదలకు ఏమైనా న్యాయం జరిగిందా అని నిలదీశారు. విద్యావ్యవస్థను నాశనం చేస్తూ, నాణ్యమైన విద్యను ఇవ్వలేని జడ్జీలు, అధికారులు అంతా ఒక "దొంగల ముఠా" లాగా తయారయ్యారని ఫైర్ అయ్యారు. డిగ్రీ చదివిన పిల్లల్లో కేవలం 6 శాతం మందికే నైపుణ్యాలు (స్కిల్స్) ఉన్నాయని నివేదికలు చెబుతుంటే, మిగిలిన 94 శాతం మంది విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం రాజీనామా చేయడం కాదు, ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన సభలో సిజేపీ జాతీయ ప్రతినిధి విజేత దహియా కూడా పాల్గొని మాట్లాడారు. నగరాల అభివృద్ధి, సుందరీకరణ పేరిట చెట్లను నరికివేయడం, కాంక్రీట్ జంగిల్‌గా మార్చడం సరికాదని హితవు పలికారు. నిజమైన అభివృద్ధి అనేది ప్రజలను వారి ఇళ్ల నుండి ఖాళీ చేయించి రోడ్డున పడేయడం ద్వారా జరగకూడదని, ప్రతి వ్యక్తికీ గౌరవంగా జీవించే హక్కు ఉంటుందని స్పష్టం చేశారు. అభివృద్ధి ఎప్పుడైనా పర్యావరణ పరిరక్షణతో కూడుకున్నదై ఉండాలని ఆమె సూచించారు. మొత్తంమీద, విద్యావ్యవస్థలో భారీ మార్పులు, పరీక్షల విధానంలో తక్షణ సంస్కరణలు రావాలని, ప్రవేశ పరీక్షలు మరియు ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పెంచి ఫలితాలను సకాలంలో విడుదల చేయాలని నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి సుమారు 200 మందితో శాంతియుతంగా నిర్వహించుకోవడానికి పోలీసులు కేవలం మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే అధికారికంగా అనుమతి ఇచ్చారు. అయితే అంచనాలకు మించి యువత, విద్యార్థులు తరలిరావడంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమయం ముగిసిన వెంటనే నిరసనకారులను ప్రశాంతంగా పంపించే దిశగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని సిజేపీ శ్రేణులు స్పష్టం చేశాయి.

Advertisment
తాజా కథనాలు