LPG Gas Cylinder :  రాయితీ సిలిండర్లపై కేంద్రం భారీ కోత..పేద కుటుంబాలపై అదనపు భారం

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు గ్యాస్‌ సబ్సిడీ విషయంలో గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటివరకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు లభిస్తున్న రాయితీని, తాజా నిర్ణయంతో కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేసింది.

New Update
Gas Cylinder

Ujjwala Yojana LPG Subsidy Cut

LPG Gas Cylinder : కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకం ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ (పీఎంయూవై) లబ్ధిదారులకు గ్యాస్‌ సబ్సిడీ విషయంలో గట్టి షాక్‌ తగిలింది. దేశంలోని పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రవేశపెట్టిన ఈ పథకం కింద సరఫరా చేసే రాయితీ సిలిండర్ల సంఖ్యను కేంద్ర ప్రభుత్వం భారీగా కుదించింది. ఇప్పటివరకు ఏడాదికి 9 సిలిండర్ల వరకు లభిస్తున్న రాయితీని, తాజా నిర్ణయంతో కేవలం 4 సిలిండర్లకే పరిమితం చేసింది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ ఉద్రిక్తతల నెపంతో పాటు, ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణనలోకి తీసుకునే ఈ మార్పు చేసినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్‌ మాల్‌ ఖనూజా వెల్లడించారు.

రాయితీ సిలిండర్ల సంఖ్యను తగ్గించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో ఉజ్వల పథకం ప్రారంభమైనప్పుడు లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు రాయితీని అందించేవారు. ఆ తర్వాత వంటకు శుద్ధ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 2022 మే నెలలో సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీని ప్రకటించి, 2023 అక్టోబరులో దానిని రూ. 300లకు పెంచారు. అయితే, సిలిండర్ల సంఖ్యను మాత్రం దఫాలుగా కోస్తూ వచ్చారు. గతేడాది ఈ కోటాను 12 నుంచి 9కి తగ్గించగా, తాజాగా దానిని 4 సిలిండర్లకు కుదించారు. అంటే కేవలం ఒకే ఏడాది వ్యవధిలో సబ్సిడీ సిలిండర్లలో ఏకంగా 66 శాతం మేర కోత విధించడంతో పేద గృహిణులు మళ్లీ కట్టెల పొయ్యి వైపు వెళ్లాల్సిన దుస్థితి వస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర రూ. 994గా ఉండగా, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో రూ. 942గా ఉన్నది. దీనిపై కేంద్ర ప్రభుత్వం రూ. 300 మేర సబ్సిడీ అందిస్తుండటంతో, ఉజ్వల లబ్ధిదారులకు నికరంగా హైదరాబాద్‌లో రూ. 694కు, ఢిల్లీలో రూ. 642కు సిలిండర్‌ లభిస్తోంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం ఏడాదిలో 4 సిలిండర్లు దాటిన తర్వాత ఐదో సిలిండర్‌ కావాలంటే లబ్ధిదారులు ఎటువంటి సబ్సిడీ లేకుండా పూర్తి ధర (రూ. 994 లేదా రూ. 942) చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు, గ్యాస్‌ కంపెనీలు ఒక్కో సిలిండర్‌ సరఫరాకు రూ. 1,600 వరకు వెచ్చిస్తున్నాయని, లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇస్తుండటం వల్ల ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ. 1,000 వరకు లబ్ధి చేకూరుతుందని అధికారులు సమర్థించుకుంటున్నారు.

ఈ సబ్సిడీ కోత నిర్ణయం వల్ల దేశంలోని నిరుపేద కుటుంబాల బడ్జెట్‌ పూర్తిగా తలకిందులవనుంది. గతంలో ఏడాదికి 9 సిలిండర్లపై రూ. 300 చొప్పున మొత్తం రూ. 2,700 మేర ఆదా అయ్యేది. ఇప్పుడు కేవలం నాలుగు సిలిండర్లకే రాయితీ పరిమితం కావడంతో, మిగిలిన ఐదు సిలిండర్లకు మార్కెట్ పూర్తి ధర చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రతి ఉజ్వల కుటుంబంపై ఏడాదికి సగటున రూ. 1,500 వరకు అదనపు ఆర్థిక భారం పడనుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలతో సతమతమవుతున్న పేదలకు ఈ నిర్ణయం గొడ్డలిపెట్టుగా మారింది.

ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, గత నెల నాటికి దేశవ్యాప్తంగా ఉజ్వల పథకం కింద దాదాపు 10.57 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ భారీ వినియోగదారుల సంఖ్యను బట్టి చూస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సబ్సిడీ కోత నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా నిధులు మిగలనున్నాయి. ఒక్కో కుటుంబంపై పడే రూ. 1,500 అదనపు భారాన్ని లెక్కిస్తే.. కేంద్ర ప్రభుత్వానికి ఏటా దాదాపు రూ. 15,855 కోట్ల మేర అదనపు ఆదాయం లేదా ఆదా చేకూరనున్నట్లు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ప్రభుత్వ ఖజానాను నింపుకోవడానికి పేదల నోటికాడి కూడును లాగేసుకుంటున్నారంటూ విపక్ష నేతలు మరియు ప్రజా సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అంతర్జాతీయ సంక్షోభాలను సాకుగా చూపిస్తూ సంక్షేమ పథకాలకు కత్తెరేయడం సరికాదని విమర్శిస్తున్నారు. "అందరికీ క్లీన్ ఎనర్జీ" అనే నినాదంతో ప్రారంభమైన ఉజ్వల యోజన.. తాజా కోతలతో నిరుపేదలను మళ్లీ పొగచూరిన కట్టెల పొయ్యిల వైపు నెట్టేసే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు