/rtv/media/media_files/2025/01/15/qku25tGfGhK98SYaZa7k.jpg)
Arvind Kejriwal in liquor policy case Photograph: (Arvind Kejriwal in liquor policy case)
ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఆయన్ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేసింది. ఆయనతో పాటుగా మాజీ మంత్రి మనీష్ సిసోడియాను సైతం విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేజ్రీవాల్ విచారణకు అనుమతి కోరుతూ 2024 డిసెంబర్ నెలలో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాయగా.. ఆయన ఆమోదం తెలిపారు. దీనిని ఈడీ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లింది. అనంతరం కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రజాప్రతినిధులలను విచారించేముందు ఈడీ అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు గతేడాది నవంబర్ లో సూచించింది. అయితే తనపై తప్పుడు ఛార్జిషీటు దాఖలు చేశారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మార్చి 21న ఈడీ అరెస్టు
2021-22కి సంబంధించి ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 2024 మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత ఇదే కేసులో కేజ్రీవాల్‌ను 2024 జూన్ 26న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది. సెప్టెంబర్ 2024లో ఆప్ చీఫ్‌కి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది . బెయిల్ పొందిన కొద్ది రోజులకే, కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిశి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.
Also Read : KTR: ఈరోజు కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ