/rtv/media/media_files/2026/05/11/suvendu-adhikari-2026-05-11-15-35-17.jpg)
పశ్చిమ బెంగాల్ కొత్త సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి తన మొదటి కేబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో జరిగిన తొలి మంత్రివర్గ భేటీలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ నిర్మించడానికి అవసరమైన భూమిని సరిహద్దు భద్రతా దళానికి (BSF) అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలవుతుందని, కేవలం 45 రోజుల్లోనే భూమి బదిలీ పూర్తి చేస్తామని ఆయన ప్రకటించారు. బంగ్లాదేశ్ నుండి జరుగుతున్న అక్రమ చొరబాటులను అడ్డుకుంటామన్న బీజేపీ ఎన్నికల హామీని ఈ నిర్ణయంతో నెరవేర్చినట్లయింది.
ఎన్నికల ప్రచార సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ, సువేందు అధికారి విలేకరులతో మాట్లాడారు. గత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సరిహద్దులను తెరిచి ఉంచిందని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం బీఎస్ఎఫ్ కు పూర్తి నియంత్రణ ఇస్తుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు బంగ్లాదేశ్‌తో సుమారు 4,097 కిలోమీటర్ల సరిహద్దు ఉండగా, అందులో దాదాపు 850 కిలోమీటర్ల మేర ఇంకా కంచె వేయాల్సి ఉంది. గత మమతా బెనర్జీ ప్రభుత్వం భూసేకరణ విషయంలో జాప్యం చేయడం వల్ల పనులు ఆగిపోయాయని, ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయని స్పష్టం చేశారు.
జనగణన వెంటనే ప్రారంభం
సరిహద్దు నిర్ణయంతో పాటు, మొదటి కేబినెట్ భేటీలో మరిన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. గత ప్రభుత్వం అడ్డుకున్న ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడానికి ఆమోదం తెలిపారు. అలాగే ఉజ్వల యోజన 3.0 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం నిలిపివేసిన సెన్సస్ (జనగణన) ప్రక్రియను కూడా వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. కేంద్ర హోం శాఖ జారీ చేసిన జూన్ 2025 సర్క్యులర్‌ను అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది.
రాష్ట్రంలో కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాన్ని సోమవారం నుంచే అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర శిక్షణ కార్యక్రమాలకు పంపడానికి అనుమతి ఇచ్చారు. వీటితో పాటు, గతంలో జరిగిన రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన 321 మంది బీజేపీ కార్యకర్తల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని సువేందు అధికారి భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, నిసిత్ ప్రామాణిక్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు త్వరలోనే జరగనుంది.
Follow Us