/rtv/media/media_files/2026/04/18/priyanka-2026-04-18-17-50-01.jpg)
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిన మరుసటి రోజే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిన్నటి పరిణామాలను ప్రజాస్వామ్యానికి దక్కిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ప్రతిపక్షాల ఐక్యత సాధించిన ఈ ఫలితం, అధికార పక్షం అధికారంలో కొనసాగేందుకు పన్నిన కుట్రకు గట్టి దెబ్బ అని ఆమె స్పష్టం చేశారు. సమాఖ్య వ్యవస్థను బలహీనపరిచేందుకు జరిగిన ప్రయత్నాలపై లభించిన విజయమిదని, కేంద్ర ప్రభుత్వానికి ఇది ఒక చీకటి రోజు అని ఆమె వ్యాఖ్యానించారు. మొదటిసారిగా కేంద్రం కోరుకున్న రీతిలో కాకుండా గట్టి షాక్‌కు గురైందని, అది వారికి తగిన శాస్తేనని ఆమె అన్నారు.
నిన్నటి ఫలితం తాలూకు ప్రభావం అధికారంలో ఉన్నవారి ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ఇది రాజ్యాంగం, ప్రతిపక్షాల ఐక్యత సాధించిన గెలుపని ప్రియాంక పేర్కొన్నారు. బిల్లు ఆమోదం పొందినా, లేదా వీగిపోయినా.. తామే మహిళల పక్షపాతులమని చెప్పుకుని క్రెడిట్ కొట్టేయాలని పాలక పక్షం భావించిందని ఆమె విమర్శించారు. అయితే మహిళా సాధికారత అనేది అంత తేలికైన విషయం కాదని, ఈ బిల్లు వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళల రిజర్వేషన్లు కాదని, తమ ఇష్టానుసారంగా వ్యవహరించే "నిరంకుశ స్వేచ్ఛ"ను పొందడమేనని ఆమె ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో లోక్‌సభలో ఎంపీల సంఖ్యను భారీగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సంస్థల పట్ల గౌరవం లేని ప్రభుత్వాన్ని ఇంత పెద్ద ఎత్తున మార్పులు చేసేందుకు ప్రతిపక్షం ఎలా అనుమతిస్తుందని ఆమె ప్రశ్నించారు.
ఈ పరిణామం అధికార కూటమికి పెద్ద ఎదురుదెబ్బ అని, దేశంలోని మహిళలు అంత అమాయకులు కారని, వారిని ఎవరూ మోసం చేయలేరని ప్రియాంక గాంధీ అన్నారు. ఉన్నావో, హత్రాస్ ఘటనలను ప్రస్తావిస్తూనే, మణిపూర్ ఉదంతంలో మహిళల తరపున ఎవరు మాట్లాడారో అందరికీ తెలుసని గుర్తు చేశారు. ప్రభుత్వ రికార్డులు వారి మాటలకు విరుద్ధంగా ఉన్నాయని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉంటే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థమైందని, ఈ ఐక్యత పట్ల తాను ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వం నిజంగా మహిళలకు మేలు చేయాలనుకుంటే, పాత వెర్షన్ అంటే 2023 బిల్లును తిరిగి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు
ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2023 బిల్లు స్పష్టం చేసిందని, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న సీట్లలోనే కోటాను అమలు చేసేందుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని ఆమె పునరుద్ఘాటించారు. 2011 జనాభా గణన ఆధారంగా డీలిమిటేషన్ నిర్వహించి, లోక్‌సభ స్థానాలను 543 నుండి 850కి పెంచాలని ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు నిన్న లోక్‌సభలో తగినంత మెజారిటీ లభించలేదు. అనుకూలంగా 298 మంది, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. శాశ్వతంగా అధికారంలో కొనసాగేందుకే ప్రభుత్వం హఠాత్తుగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని, ఇదంతా ఒక పెద్ద రాజకీయ కుట్రలో భాగమని ప్రియాంక గాంధీ ఆరోపించారు.
Follow Us