/rtv/media/media_files/2026/05/25/india-pak-border-2026-05-25-20-03-07.jpg)
India Pak Border
India Pak Border : భారత్-పాక్ సరిహద్దు (ఇండో-పాక్ బార్డర్) అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఇరు దేశాల మధ్య ఉండే ఉద్రిక్తతలు, పహారా కాసే సైనికులు, ముళ్లపొదలు. కానీ, రాత్రి వేళ ఆకాశం నుంచి చూస్తే ఈ సరిహద్దు ఎంత అద్భుతంగా, కాంతులీనుతూ కనిపిస్తుందో ఎప్పుడైనా ఊహించారా? సరిగ్గా అలాంటి ఒక అరుదైన దృశ్యాన్ని కళ్లకు కడుతూ ఓ పైలట్ తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ దృశ్యం నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తుంది.
ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) పైలట్, కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఈ అరుదైన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. రాత్రి వేళ ప్రయాణికులతో వెళ్తున్న విమానం ఈ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపం గుండా వెళ్తున్న సమయంలో ఆయన కాక్‌పిట్ నుండి ఒక ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ చేశారు.
"ప్రయాణికులారా.. దయచేసి మీ పక్కన ఉన్న కిటికీల్లోంచి ఒకసారి బయటకు చూడండి. మీకు అక్కడ ఒక కాంతి రేఖ కనిపిస్తుంది. అది మరేదో కాదు.. ప్రపంచంలోనే అత్యధిక గస్తీ, నిఘా ఉండే 'భారత్-పాక్ సరిహద్దు' (రాడ్‌క్లిఫ్ లైన్)." అని కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్, తెలిపారు.పైలట్ మాటలతో ప్రయాణికులు కిటికీల్లోంచి బయటకు చూడగా.. నల్లటి చీకటిలో వేల మైళ్ల పొడవునా పసుపు పచ్చ దీపాలను వరుసగా పేర్చినట్లు ఒక అద్భుతమైన కాంతి రేఖ కనిపించింది. కొండలు, మైదానాల గుండా సాగిపోయే ఆ బార్డర్ లైట్ల వెలుతురు పైనుంచి చూసినప్పుడు ఒక దండలా మెరిసిపోతూ కనిపించింది.
అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా..
భారత్-పాక్ సరిహద్దు వెంబడి చొరబాట్లను అరికట్టేందుకు, భద్రతా కారణాల దృష్ట్యా ఇరు దేశాలు (ముఖ్యంగా భారత్) భారీ ఎత్తున ఫ్లడ్‌లైట్లను ఏర్పాటు చేశాయి. ఈ లైట్ల వెలుతురు ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతరిక్ష కేంద్రం (ISS) నుండి కూడా రాత్రి వేళ ఈ సరిహద్దు ఒక బ్రైట్ ఆరెంజ్ లైన్‌లా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు విమానం విండో సీట్ నుంచి కూడా ఈ దృశ్యం అంతే స్పష్టంగా కనిపించడంతో ప్రయాణికులు అబ్బురపడ్డారు.ఈ వీడియో నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం, లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు:
రాజకీయ వైరమే కానీ..: "సరిహద్దుకు రెండు వైపులా ఉన్న ప్రజల మధ్య వైరం కేవలం రాజకీయమైనదే కానీ వ్యక్తిగతం కాదు" అని ఒక నెటిజన్ ఎమోషనల్ కామెంట్ చేశారు. "ఎప్పటికీ కలవని రెండు సముద్రాలు పక్కపక్కనే ప్రవహిస్తున్నట్లు ఈ కాంతి రేఖ ఇరు దేశాలను వేరు చేస్తూ కనిపిస్తోంది" అని మరొకరు అభివర్ణించారు.ఇంతటి భారీ సరిహద్దు వెంబడి నిరంతరం విద్యుత్, కాంతి ఉండేలా చూస్తూ, దేశాన్ని కాపాడుతున్న భద్రతా దళాల సాంకేతిక నైపుణ్యాన్ని మరికొందరు కొనియాడారు.యుద్ధాలు, ఉద్రిక్తతలకు నిలయంగా భావించే సరిహద్దు.. ఆకాశం నుండి చూసినప్పుడు ఇంత ప్రశాంతంగా, అందంగా కనిపిస్తుందని ఈ వీడియో నిరూపించింది. మీరు కూడా ఈ వైరల్ వీడియోపై ఒక లుక్కేయండి!
Follow Us