Delhi Professor: 1,400 కిలోమీటర్లు వెళ్లి మరి చంపేశారు.. ప్రొఫెసర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులు ఏకంగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, ఢిల్లీలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.

New Update
delhi prof

ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హత్య కేసును పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ఛేదించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ దంపతులు ఏకంగా 1,400 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చి, ఢిల్లీలో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. కోట్ల విలువైన ఆస్తి వివాదమే ఈ దారుణ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు.

ఢిల్లీ శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దేవోస్మిత పాల్, తూర్పు ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో గల 'సత్యం అపార్ట్‌మెంట్స్' ఫ్లాట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమెకు 2017లో పెళ్లయినా, 2022లో భర్తతో విడిపోయారు. భర్త బెంగళూరులో ఉంటుండగా, ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. అయితే, బుధవారం ఆమె తన ఫ్లాట్‌లోనే శవమై కనిపించారు. తలపై బలమైన గాయం, చేతి నరాలు కట్ చేసి ఉండటంతో ఇది హత్యగా అనుమానించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో నగలు, డబ్బు అలాగే ఉండటంతో ఇది దొంగతనం కోసం జరిగిన హత్య కాదని నిర్ధారించుకున్నారు. ఏడు ప్రత్యేక పోలీస్ టీమ్‌లు నాలుగు రాష్ట్రాల్లో జరిపిన తనిఖీల తర్వాత.. పశ్చిమ బెంగాల్‌లోని వర్ధమాన్ లో నిందితులైన రాంప్రసాద్ దాస్, భాన్‌శ్రీ దాస్‌లను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఉన్న వీరి మైనర్ కొడుకును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితులు ఇద్దరూ బెంగాల్‌లోని వర్ధమాన్‌లో ఉంటున్నారు. దేవోస్మితకు తన తాతగారి ద్వారా బెంగాల్‌లో కోట్ల విలువైన ఆస్తి వచ్చింది. నిందితులు ఆ ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. ఎలాగైనా ఆ ఆస్తిని కొట్టేయాలని వాళ్లు ప్లాన్ చేశారు. కానీ, దేవోస్మిత మాత్రం ఇల్లు ఖాళీ చేయాలంటూ వారిపై ఒత్తిడి తెస్తోంది. దీంతో ఆమెను అంతమొందించాలని స్కెచ్ వేశారు.

మైనర్ కొడుకును కూడా వెంటబెట్టుకుని

బుధవారం నాడు ప్రొఫెసర్‌ను కలవాలనే నెపంతో ఈ దంపతులు తమ మైనర్ కొడుకును కూడా వెంటబెట్టుకుని ఢిల్లీ వచ్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే బాబును తెచ్చారు. అపార్ట్‌మెంట్‌కు ప్రైవేట్ క్యాబ్‌లో వచ్చిన వీరు.. మొహాలకు మాస్కులు వేసుకుని, లిఫ్ట్ వాడకుండా మెట్ల ద్వారా ఆరో అంతస్తులోని దేవోస్మిత ఫ్లాట్‌కు వెళ్లారు. తెలిసిన వాళ్లే కావడంతో దేవోస్మిత వారిని ఇంట్లోకి రానిచ్చింది. లోపలికి వెళ్లిన కాసేపటికే తమతో తెచ్చుకున్న ఆయుధంతో ఆమెను దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత కేవలం 30 నిమిషాల్లోనే బట్టలు మార్చుకుని, కింద వేచి ఉన్న క్యాబ్‌లోనే అక్కడి నుంచి పరారయ్యారు.

బుధవారం దేవోస్మితకు ఆమె సోదరి దేవరతి ఎంత ఫోన్ చేసినా ఎత్తలేదు. అనుమానం వచ్చి గురువారం ఫ్లాట్‌కు వెళ్లి చూడగా బయట తాళం వేసి ఉంది. తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిన దేవరతికి.. దేవోస్మిత రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది. వెంటనే ఆమె పోలీసులకు సమాచారం అందించింది.

రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం ఆ అపార్ట్‌మెంట్‌కు వచ్చిన సుమారు 200 మందిని పరిశీలించి, అందులో 13 మంది అనుమానితుల లిస్ట్ తయారు చేశారు. సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలించగా మాస్కులు వేసుకున్న దంపతుల కదలికలు కనిపించాయి. వారు ఎెక్కిన క్యాబ్ నంబర్ ఆధారంగా డ్రైవర్‌ను పట్టుకుని, ఆ రైడ్ వివరాలను సేకరించారు. ఆ ఆధారాలతో నిందితులు బెంగాల్‌లోని వర్ధమాన్‌కు పారిపోయినట్లు గుర్తించి, అక్కడికి వెళ్లి వారిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిని ఢిల్లీకి తీసుకురావడానికి పోలీసులు ట్రాన్సిట్ రిమాండ్ కోసం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. 

Advertisment
తాజా కథనాలు