Airport Fee : విమాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇబ్బందుల్లో ఉన్న భారతీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం తగ్గించింది.

New Update
airport

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల వల్ల ఇబ్బందుల్లో ఉన్న భారతీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో ల్యాండింగ్, పార్కింగ్ ఛార్జీలను 25 శాతం తగ్గిస్తూ భారత విమానాశ్రయ ఆర్థిక నియంత్రణ సంస్థ (AERA) కీలక నిర్ణయం తీసుకుంది.

ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమానయాన సంస్థలపై ఆర్థిక భారం భారీగా పెరిగింది. ముఖ్యంగా పాకిస్థాన్ గగనతలాన్ని ఉపయోగించుకోలేకపోవడం వల్ల విమానాలు ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల ఇంధన ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థలు ప్రభుత్వాన్ని కోరడంతో ఈ తాత్కాలిక ఊరట కల్పించారు.

మూడు నెలల పాటు అందుబాటులో

ఈ 25 శాతం రాయితీ ప్రస్తుతానికి మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం దేశీయ విమానాలకు మాత్రమే వర్తిస్తుంది. విమాన సంస్థలకు ఇంధనం, సిబ్బంది జీతాల తర్వాత విమానాశ్రయ ఛార్జీలే మూడవ అతిపెద్ద ఖర్చు. తాజా తగ్గింపు వల్ల విమాన సంస్థల ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడనుంది. ఈ రాయితీ నేరుగా విమాన సంస్థలకు దక్కుతుంది కాబట్టి టికెట్ ధరలు వెంటనే తగ్గకపోవచ్చు. అయితే, పెరుగుతున్న ఖర్చుల పేరుతో విమాన సంస్థలు ప్రయాణికులపై బాదుడు పెంచకుండా ఈ నిర్ణయం అడ్డుకుంటుంది. దీనివల్ల పరోక్షంగా సామాన్యులకు భారం తగ్గనుంది.

ఈ వార్త వెలువడగానే షేర్ మార్కెట్‌లో విమానయాన సంస్థల షేర్లు దూసుకుపోయాయి. ముఖ్యంగా ఇండిగో షేర్లు ఏకంగా 10 శాతం పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. యుద్ధంపై రెండు వారాల కాల్పుల విరమణ వార్తలు కూడా తోడవడంతో ఇన్వెస్టర్లు ఉత్సాహంగా కొనుగోళ్లు జరిపారు.

ఈ మూడు నెలల కాలంలో విమానాశ్రయాలకు వచ్చే ఆదాయం తగ్గుతుంది. అయితే, భవిష్యత్తులో టారిఫ్ సవరణల సమయంలో ఈ లోటును పూడ్చుకునేలా విమానాశ్రయాలకు అనుమతిస్తామని AERA స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ఈ విపత్కర పరిస్థితుల్లో విమానయాన రంగాన్ని ఆదుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది.

Advertisment
తాజా కథనాలు