AIADMK:  సీఎం ఎన్నికవేళ..అన్నాడీఎంకేలో ముసలం..36 మంది ఎమ్మెల్యేలు జంప్

అసెంబ్లీ ఫలితాల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK)లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ 36 మంది ఎమ్మెల్యేలతో కూడిన బలమైన వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. వీరంతా టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు.

New Update
FotoJet - 2026-05-10T063930.193

AIADMK Leaders interested in joining TVK

AIADMK: తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే (AIADMK)లో తీవ్ర అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎన్డీయే కూటమికి నేతృత్వం వహిస్తున్న ఈ పార్టీలో నాయకత్వ మార్పు కోరుతూ ఒక బలమైన వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. పార్టీ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి (EPS) ఒంటెద్దు పోకడలపై గుర్రుగా ఉన్న 36 మంది ఎమ్మెల్యేలు ఏకంగా పుదుచ్చేరిలోని ఒక రిసార్ట్‌లో రహస్య శిబిరం (క్యాంప్) నిర్వహించడం తమిళ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఈ అసమ్మతి వర్గానికి పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యత్వానికి హఠాత్తుగా రాజీనామా చేసిన సీవీ షణ్ముగం ప్రధాన సూత్రధారిగా వ్యవహరించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' వైపు చూపు

ఎన్నికల ఫలితాలు వెల్లడైన వెంటనే అన్నాడీఎంకేలోని అసమ్మతి వర్గం.. కోలీవుడ్ స్టార్ విజయ్‌కి చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. తమిళనాడులో బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న టీవీకే వైపు ఈ 36 మంది ఎమ్మెల్యేలు మొగ్గు చూపారు. అయితే అన్నాడీఎంకే ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నందున, నేరుగా వారితో చేతులు కలపడానికి విజయ్ వర్గం అంగీకరించలేదు. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చి, సొంతంగా ఒక గ్రూపుగా ఏర్పడేందుకు వీరు పుదుచ్చేరిలో క్యాంప్ రాజకీయాలకు తెరలేపారు. కొత్త ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి పదవితో పాటు కీలక మంత్రి పదవులను కూడా ఈ వర్గం డిమాండ్ చేసినట్లు ప్రచారం సాగుతోంది.అయితే, శనివారం మధ్యాహ్నానికల్లా విజయ్ నేతృత్వంలోని టీవీకే సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించడంతో, షణ్ముగం వర్గం ఆశించిన స్థాయిలో బేరసారాలు సాగించలేకపోయింది. అయినప్పటికీ ఈ తిరుగుబాటు వర్గం వెనక్కి తగ్గడం లేదు.

 పుదుచ్చేరి నుంచి శుక్రవారమే చెన్నై చేరుకున్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రధాన స్రవంతికి దూరంగా విడివిడిగానే ఉంటున్నారు. డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా ఎడప్పాడి పళనిసామి రంగంలోకి దిగి, ఈ ఎమ్మెల్యేలను తన నివాసానికి పిలిపించుకుని పలుమార్లు రహస్య చర్చలు జరిపారు. అనునయించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈపీఎస్ ఇల్లు వదిలిన వెంటనే ఈ ఎమ్మెల్యేలంతా చెన్నై ఎమ్మార్సీనగర్‌లోని సీవీ షణ్ముగం నివాసంలో మకాం వేసి తదుపరి కార్యాచరణపై సమాలోచనలు జరుపుతున్నారు.ఈ తిరుగుబాటు వర్గంలో కేవలం సాధారణ ఎమ్మెల్యేలే కాకుండా అన్నాడీఎంకేలో గట్టి పట్టున్న మాజీ మంత్రులు కూడా ఉండటం పళనిసామికి పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సి.విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, అలాగే మహిళా ఎమ్మెల్యే లీమా రోస్ వంటి బలమైన నేతలు సీవీ షణ్ముగం వెంటే నడుస్తున్నారు.

  పళనిసామి నాయకత్వంలో పార్టీ వరుస పరాజయాలు మూటగట్టుకుంటోందని, క్యాడర్‌లో ఉత్సాహం నింపాలంటే తక్షణమే నాయకత్వ మార్పు చేపట్టాలని వీరు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.తమ డిమాండ్ల చిట్టాను ఈపీఎస్ ముందు ఉంచినప్పటికీ, ఆయన దీనిపై ఎలా స్పందించారనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఈ అంతర్గత కలహాలు అన్నాడీఎంకేను చీలిక వైపు నడిపిస్తాయా, లేక ఈపీఎస్ రాజీ ఫార్ములాతో పార్టీని కాపాడుకోగలుగుతారా అనేది రానున్న కొద్ది రోజుల్లో తేలనుంది.

Advertisment
తాజా కథనాలు