Tamil Nadu : కొన్ని గంటల్లో గుడ్ న్యూస్ చెప్తా..  పళనిస్వామి సంచలన ప్రకటన!

తమిళనాడు రాజకీయాలు గత ఆరు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని విలక్షణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎవరిదనే సస్పెన్స్ ఇంకా వీడలేదు.

New Update
palaniswamy

తమిళనాడు రాజకీయాలు గత ఆరు దశాబ్దాల చరిత్రలో ఎన్నడూ చూడని విలక్షణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి నాలుగు రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వం ఎవరిదనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒకవైపు నటుడు విజయ్‌కు చెందిన తమిళగ వెట్రి కళగం (TVK) 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినా.. మేజిక్ ఫిగర్ (118) అందుకోలేక సతమతమవుతోంది. ఈ గ్యాప్‌లోనే అటు డీఎంకే, ఇటు అన్నాడీఎంకే పార్టీలు అధికారం కోసం తెరవెనుక వేగంగా పావులు కదుపుతున్నాయి.

విజయ్ పార్టీ (TVK) తమ ఎమ్మెల్యేలను లాగేస్తుందేమో అన్న భయంతో అన్నాడీఎంకే (AIADMK) తక్షణ రక్షణ చర్యలు చేపట్టింది. పార్టీకి చెందిన దాదాపు 28 మందికి పైగా (మొత్తం 47 మంది) ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరిలోని ఒక విలాసవంతమైన రిసార్ట్‌కు తరలించింది. రాబోయే ఏడు రోజుల పాటు ఈ రిసార్ట్ గదులను బుక్ చేసినట్లు సమాచారం. ఎవరికీ చిక్కకుండా, ఫోన్లు కూడా ఎక్కువగా మాట్లాడకుండా ఎమ్మెల్యేలను గట్టి నిఘాలో ఉంచారు.

శాసనసభాపక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామి

ఈ రిసార్ట్ వేదికగానే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎడప్పాడి పళనిస్వామిని ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఈపీఎస్ తన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ.. "కంగారు పడకండి.. త్వరలోనే మంచి వార్త వింటారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం!" అంటూ ధీమా వ్యక్తం చేశారు. కనీస మెజారిటీ లేకపోయినా పళనిస్వామి ఇంత నమ్మకంగా ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

మరోవైపు చెన్నైలో స్టాలిన్ అధ్యక్షతన జరిగిన డీఎంకే సమావేశం కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సమావేశంలో డీఎంకే కూటమిలో ఉంటూ విజయ్‌కు మద్దతు పలికిన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. అలాగే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు రాకుండా ఉండేందుకు, ఒక స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి 'అత్యవసర రాజకీయ నిర్ణయాలు' తీసుకోవడానికైనా స్టాలిన్‌కు పూర్తి అధికారాలు ఇస్తూ తీర్మానం ఆమోదించారు.

గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తీసుకున్న నిర్ణయమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమైంది. ఎవరైనా సరే.. మెజారిటీ నిరూపించుకుంటే వారికే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తా అని గవర్నర్ ప్రకటించడంతో, పాత ద్రవిడ పార్టీల ఆశలకు రెక్కలొచ్చాయి. దీంతో డీఎంకే-అన్నాడీఎంకేలు కలిసి ఒక రహస్య ఒప్పందానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తోంది.

ఒకవేళ ప్రజల తీర్పును కాలరాస్తూ డీఎంకే, అన్నాడీఎంకేలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే.. తమ పార్టీకి చెందిన 108 మంది ఎమ్మెల్యేలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించి అసెంబ్లీని రద్దు చేసేలా విజయ్ వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు