/rtv/media/media_files/2026/05/14/aiadmk-2026-05-14-10-30-33.jpg)
తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. బుధవారం అసెంబ్లీలో జరిగిన కీలకమైన బలపరీక్షలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సీఎం విజయ్ విజయం సాధించారు. అనూహ్య పరిణామాల మధ్య జరిగిన ఈ ఫ్లోర్ టెస్టులో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా మొత్తం 144 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయడం విశేషం. దీంతో విజయ్ తన మెజారిటీని నిరూపించుకుని పీఠాన్ని సుస్థిరం చేసుకున్నారు.
ఈ బలపరీక్షలో ప్రధాన ప్రతిపక్షమైన AIADMK రెండుగా చీలిపోయింది. పార్టీ అధినేత పళనిస్వామి (EPS) విప్ జారీ చేసినప్పటికీ, దాదాపు 25 మంది రెబల్ ఎమ్మెల్యేలు విప్ ను ధిక్కరించి TVK ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. ఎస్.పి. వేలుమణి నేతృత్వంలోని ఈ రెబల్ వర్గం విజయ్ వైపు నిలవడంతో అసెంబ్లీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మరోవైపు, పళనిస్వామికి విధేయులుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతకుముందు జరిగిన చర్చలో భాగంగా డిఎంకె ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడంతో మెజారిటీ మార్కు సులభతరమైంది.
పళనిస్వామి కఠిన చర్యలు
పార్టీ లైన్‌ను ధిక్కరించి విజయ్‌కు మద్దతు పలికిన నేతలపై ఎడప్పాడి పళనిస్వామి కఠిన చర్యలు చేపట్టారు. పార్టీలో అత్యంత కీలక నేతలుగా ఉన్న ఎస్.పి. వేలుమణి, సి.వి. షణ్ముగం, సి. విజయభాస్కర్లతో పాటుగా 25 మంది నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫ్లోర్ టెస్టులో వీరు అనుసరించిన వైఖరి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసిన పళనిస్వామి, వారి స్థానంలో కొత్త జిల్లా కార్యదర్శులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిణామంతో తమిళనాడులో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, విసికె వంటి మిత్రపక్షాలతో పాటు ఇప్పుడు AIADMK రెబల్స్ మద్దతు కూడా తోడవడంతో విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం బలోపేతమైంది. అయితే, తన తొలగింపు చెల్లదని షణ్ముగం సవాల్ చేస్తుండటంతో AIADMKలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరేలా కనిపిస్తోంది. మొత్తం మీద విజయ్ విజిల్ అసెంబ్లీలో గట్టిగానే వినిపించడంతో తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైందనే చర్చ సాగుతోంది.
Follow Us