/rtv/media/media_files/2026/05/24/arrest-2026-05-24-21-51-07.jpg)
బెంగళూరులో దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్ట్ సైబర్ మోసం వెలుగుచూసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులమంటూ నమ్మించి, 74 ఏళ్ల వృద్ధురాలిని భయభ్రాంతులకు గురిచేసి ఏకంగా రూ.24 కోట్లు దోచేసారు. కర్ణాటక స్టేట్ సైబర్ కమాండ్ యూనిట్ పోలీసులు ఈ ముఠా గుట్టురట్టు చేసి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
బెంగళూరుకు చెందిన లక్ష్మి రామమూర్తి (74) అనే వృద్ధురాలిని సైబర్ కేటుగాళ్లు టార్గెట్ చేశారు. తాము సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులమంటూ ఆమెకు పరిచయం చేసుకున్నారు. ఆమె ఏదో పెద్ద నేరానికి పాల్పడిందని, దర్యాప్తు జరుగుతోందని నమ్మిస్తూ డిజిటల్ అరెస్ట్ పేరిట ఆమెను ఒక గదికే పరిమితం చేసి తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశారు.
కేసు నుంచి బయటపడాలంటే డబ్బులు పంపాలని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఆమె.. తన ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా నుంచి ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 24 మధ్య కాలంలో 26 విడతలుగా దాదాపు రూ.24 కోట్లను బదిలీ చేశారు. ఈ డబ్బు దేశవ్యాప్తంగా ఉన్న 10 వేర్వేరు బ్యాంకుల్లోని 23 మ్యూల్ అకౌంట్లలోకి చేరింది.
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సాయంతో దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు బదిలీ అయిన మొదటి లేయర్ అకౌంట్లను గుర్తించి వాటిని ఫ్రీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా రూ.4 కోట్లకు పైగా నిధులను ఫ్రీజ్ చేయగా, కోర్టు ఆర్డర్ల ద్వారా మరో రూ.1.46 కోట్లను రికవరీ చేశారు.
వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్ట్
ఈ అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఆరుగురు నిందితులను వేర్వేరు రాష్ట్రాల్లో అరెస్ట్ చేసి, వారి నుంచి 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దేశవ్యాప్త సైబర్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోందని కర్ణాటక పోలీసులు తెలిపారు. చట్టబద్ధమైన ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థ కూడా ఆన్‌లైన్ వీడియో కాల్స్‌లో ఎవరినీ డిజిటల్ అరెస్ట్ చేయదని, అలాంటి కాల్స్ వస్తే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Follow Us