Bihar : ఘోర ప్రమాదం: బస్సు-వ్యాన్ ఢీ, 13 మంది మృతి!

బీహార్ లో దారుణం జరిగింది.  కటిహార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక బస్సు,  వ్యాన్ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

New Update
bihar

బీహార్ లో దారుణం జరిగింది.  కటిహార్ జిల్లాలో శనివారం సాయంత్రం ఒక బస్సు,  వ్యాన్ ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోధా పోలీస్ స్టేషన్ పరిధిలోని గెరాబారి గ్రామం వద్ద జాతీయ రహదారి-31పై ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున, అలాగే గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరపున ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలోనే ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు కటిహార్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

ప్రమాదానికి గురైన వ్యాన్‌లో గిరిజన తెగకు చెందిన వారు ప్రయాణిస్తున్నారు. వీరంతా జార్ఖండ్ నుంచి నౌగచియా మీదుగా తమ స్వస్థలమైన పూర్ణియాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పూర్ణియా నుండి వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, ప్రయాణంలో అక్కడక్కడా వాహనాన్ని తప్పుగా నడిపాడని కొందరు ప్రయాణికులు ఆరోపించారు. బస్సు దత్పూర్ ముసాహరి చౌక్ వద్దకు రాగానే అదుపుతప్పి వ్యాన్‌ను ఢీకొట్టిందని కోధా ఎస్‌హెచ్‌ఓ సుజీత్ కుమార్ తెలిపారు.

ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న రెండు బైకులు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం నెలకొంది. అయితే బస్సు డ్రైవర్ మద్యం సేవించాడా లేదా అనే విషయంలో ఇంకా ఖచ్చితమైన ఆధారాలు లభించలేదని, అతను కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడని పోలీసులు వెల్లడించారు. స్థానికులు, పోలీసులు కలిసి సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కటిహార్ సదర్ ఆసుపత్రికి తరలించారు. సుమారు 40 మంది ప్రయాణిస్తున్న ఆ వ్యాన్ ప్రమాదానికి గురికావడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Advertisment
తాజా కథనాలు