Hanuman Shobha Yatra :హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలు ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాలతో శోభాయమానంగా వెలుగొందుతున్నాయి. శనివారం తెల్లవారు జామునుంచే భక్తులు హనుమాన్ ఆలయాలకు చేరుకుని స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ వీర హనుమాన్ శోభాయాత్రలు జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ నుంచి నేటి మధ్యాహ్నం ప్రారంభమైంది.. గౌలిగూడ నుంచి కోరి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం వరకు ఈ ర్యాలీ సాగనుంది. భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. ఈ శోభాయాత్రలో వేలాది వాహనాలతో పాటు లక్షలాది మంది భక్తులు పాల్గొనడటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.12 కిలోమీటర్ల యాత్రకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడలోని శ్రీరామ మందిరానికి చేరుకుని భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.
Also Read: భారీ భూకంపం.. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని ప్రజలు పరుగే పరుగు- ఎక్కడంటే? ‘జై బోలో హనుమాన్‌కి, జైశ్రీ రాం’ అంటూ భక్తుల ఆధ్యాత్మిక నినాదాలతో హైదరాబాద్ మార్మోగుతోంది. యువత ఉత్సాహంతో జై హనుమాన్ అంటూ నినదిస్తున్నారు. వేడుకల్లో భాగంగా నిర్వహించే శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తనిఖీలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు కొనసాగనున్న ఈ యాత్రలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో హనుమాన్ శోభాయాత్రకు ముస్లిం సోదరులు స్వాగతం పలికి మతసామరస్యాన్ని చాటారు.
పశ్చిమ మండలం పరిధిలో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఫిలింనగర్, సంజీవరెడ్డినగర్, మధురానగర్, బోరబండ, మాసబ్‌ట్యాంక్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇప్పటికే ర్యాలీలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నిర్వహిస్తారనే దానిపై పోలీసులకు స్పష్టత వచ్చింది. కొన్ని ర్యాలీలు ఉత్సవాలు జరిగే ఆలయాల పరిధిలోనే జరుగుతుండగా, మరికొన్ని ప్రధాన ర్యాలీల్లో కలుస్తుండటంతో అందుకు అనుగుణంగా అదనపు బలగాలను రంగంలోకి దించారు. సుమారు రెండు వేల మందికి పైగా అదనపు సిబ్బందిని హనుమాన్ శోభాయాత్ర బందోబస్తుకు ఉపయోగించనున్నారు. ఆలయాల వద్ద కూడా బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆలయాలకు వచ్చే మహిళా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా మహిళా సిబ్బందిని వినియోగిస్తున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!