Independence Day Special Story : ఆ గ్రామంతా జవాన్లే.. ఆర్మీలో చేరడమే వారి లక్ష్యం

ఆర్మీలో చేరాలంటే అందరూ భయపడే రోజుల్లో.. ఆ గ్రామం నుంచి మాత్రం మేమున్నామంటూ దేశసేవ కోసం క్యూ కట్టారు. సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న నేటి సమాజంలోనూ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది. ఇంతకీ ఏది ఆ గ్రామం.. ఎక్కడుంది..?

New Update
Independence Day Special Story : ఆ గ్రామంతా జవాన్లే.. ఆర్మీలో చేరడమే వారి లక్ష్యం

Independence Day Special Story: ఆర్మీ ఉద్యోగం అంటేనే భయపడే రోజుల్లోనే ఆ గ్రామం నుండి అత్యధిక మంది దేశసేవ కోసం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం పని చేస్తున్న వారితో కలిసి వంద మందికి పైగా ఆర్మీతో అనుబంధం కలిగిన వారు ఆ గ్రామంలో ఉన్నారు. పదవి విరమణ పొందిన వారు దాదాపుగా 60కి పైగా ఉంటే.. 30 మందికి పైగా ప్రస్తుతం సర్వీసులో ఉన్నారు. యువత అంతా సాఫ్ట్‌వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న ఈ ఆధునిక సమాజంలో ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది.

దేశసేవే మానవసేవ..

మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని మహమ్మదాబాద్ మండలం వెంకట్‌రెడ్డి పల్లి గ్రామం నుండి దాదాపు 40 ఏళ్ల క్రితం కొంతమంది ఆర్మీ ఉద్యోగానికి (Army Job) ఎంపిక అయ్యారు. వారిని ఆదర్శంగా తీసుకున్న తర్వాతి తరం యువత ఆర్మీ ఉద్యోగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అలా ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటిదాకా ఆర్మీలో చేరిన వారి సంఖ్య సెంచరీని దాటింది. దేశ సేవలో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించాలని నిశ్చయించుకున్న గ్రామస్తులు జిల్లాలోనే అత్యధికంగా ఆర్మీ ఉద్యోగులు ఉన్న గ్రామంగా రికార్డు కొట్టారు.

ఒక్కో ఇంటి నుంచి ఇద్దరు..

ఆర్మీలో ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వారు వ్యాపారాలను నిర్వహించుకుంటూ.. వ్యవసాయం చేస్తూ.. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువకులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. వెంకట్ రెడ్డి పల్లి గ్రామంలో ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉంటాడు. అందులో అత్యధికంగా ఆర్మీ ఉద్యోగులే ఉండటం ఈ గ్రామ ప్రత్యేకత. ఒక్కగానొక్క కొడుకును సైతం అర్మీలో పనిచేసేందుకు బార్డర్‌కు పంపించే తల్లిదండ్రులు ఈ గ్రామంలో కనిపిస్తారు. అంతేకాదు ఒక్కో ఇంట్లో నుంచి ఇద్దరు అన్నదమ్ములు కూడా ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు.

సమాజంపై బాధ్యతతోనే..

దేశ సేవలో తమ గ్రామానికి ఒక ప్రత్యేకతను ఏర్పర్చాలనే లక్ష్యం తో ప్రస్తుత యువత సైతం నడుం బిగించారు. ఆర్మీ ఉద్యోగానికి ఎంపిక కావడమే లక్ష్యంగా అనునిత్యం శారీరక దృఢత్వం కోసం సాధన చేస్తున్నారు. సీనియర్ల సలహాలు సూచనలు తీసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా అధిక ఆదాయం ఉండే రంగాన్ని ఎంచుకుంటున్న ఈ రోజుల్లో దేశ సేవలో తమ పాత్ర ఉండాలని తపిస్తుంది వెంకట్ రెడ్డి పల్లి గ్రామం. దేశంలోని ప్రతి పౌరుడు ఆర్మీలో కొన్నాళ్ల పాటు విధులు నిర్వహిస్తే దేశం పట్ల గౌరవం పెరగడంతో పాటు సమాజంపై బాధ్యత పెరుగుతుంది.. క్రమశిక్షణతో కూడిన జీవన విధానానికి అలవాటు పడతారు. మెరుగైన సమసమాజ స్థాపన చేయవచ్చనేది ఆర్మీలో పనిచేసిన ఉద్యోగులు చెబుతున్న మాట.

Also Read: ఆ ఊరిలో ఇండిపెండెన్స్ డే చాలా స్పెషల్.. కారణం ఇదే..!

#mahaboobnagar #mahabubnagar #independence-day-special-story #soldiers-in-mahabubnagar
Advertisment
Advertisment
తాజా కథనాలు