/rtv/media/media_files/2026/03/19/ugadi-2026-2026-03-19-10-04-26.jpg)
ugadi 2026
మేష రాశి
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 4
మేష రాశి వారికి ఈ ఏడాది అత్యంత అనుకూలమైన కాలం. డిసెంబరు ఆరంభం వరకూ రాహువు లాభ స్థానంలో సంచరించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని వైపుల నుంచి ధన ప్రవాహం ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అయితే రాజపూజ్యం కంటే అవమానం ఎక్కువగా ఉండటం వల్ల మీ మాటతీరును జాగ్రత్తగా చూసుకోవాలి. గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి మౌనం పాటించడం మేలు.
వృషభ రాశి
ఆదాయం: 5 వ్యయం: 14 రాజపూజ్యం: 5 అవమానం: 4
వృషభ రాశి వారికి ఈ ఏడాది రాజయోగం పడుతుంది. శని లాభ స్థానంలో, రాహువు రాజ్య స్థానంలో ఉండటం మీకు ప్రధాన బలం. డిసెంబరు నుంచి ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. సంవత్సర ఆరంభంలో గురుబలం వల్ల ఆర్థిక స్థితి అత్యుత్తమంగా ఉంటుంది. జూన్ తర్వాత ప్రయాణాలు అధికమవుతాయి. అక్టోబరు తర్వాత కుటుంబ బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి
ఆదాయం: 8 వ్యయం: 11 రాజపూజ్యం: 1 అవమానం: 7
ఈ రాశి వారికి జూన్ నుంచి అద్భుతమైన ఫలితాలు మొదలవుతాయి. జూన్ 2 వరకు మానసిక ఆందోళనలు ఉన్నా, ఆ తర్వాత గురువు ధన స్థానానికి మారడంతో ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తిపరంగా బాధ్యతలు పెరుగుతాయి. రాహువు సంచారం వల్ల ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. అష్టమ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి
ఆదాయం: 2 వ్యయం: 11 రాజపూజ్యం: 4 అవమానం: 7
కర్కాటక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అదృష్టం కంటే మీ కష్టాన్నే ఎక్కువగా నమ్ముకోవాలి. రాహువు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు రావచ్చు. జూన్ 2 నుంచి గురువు జన్మరాశిలో ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి.
సింహ రాశి
ఆదాయం: 5 వ్యయం: 5 రాజపూజ్యం: 7 అవమానం: 7
సింహ రాశి వారికి ఈ సంవత్సరం ప్రయత్నానికి తగ్గ ఫలితం ఉంటుంది. అష్టమ శని ప్రభావం వల్ల పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. అయితే జూన్ వరకు గురువు లాభ స్థానంలో ఉండటం వల్ల దైవబలం తోడవుతుంది. సమష్టి నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఉద్యోగ మార్పులు లేదా పదోన్నతులకు అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.
కన్యా రాశి
ఆదాయం: 8 వ్యయం: 11 రాజపూజ్యం: 3 అవమానం: 3
కన్యా రాశి వారికి ఈ ఏడాది విజయవంతంగా సాగుతుంది. రాహువు షష్ఠ స్థానంలో ఉండటం వల్ల మీకు కొత్త శక్తి లభిస్తుంది. శత్రువులపై విజయం, కోర్టు కేసుల పరిష్కారం, రుణ విముక్తి కలుగుతాయి. గృహ నిర్మాణానికి అనుకూలమైన కాలం. మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆశయాలు నెరవేరుతాయి.
తులా రాశి
ఆదాయం: 5 వ్యయం: 14 రాజపూజ్యం: 6 అవమానం: 3
తులా రాశి వారికి రాజయోగం సూచిస్తోంది. శని షష్ఠ స్థానంలో ఉండటం వల్ల మీ నిర్ణయాలు తిరుగులేకుండా ఉంటాయి. జూన్ వరకు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. విదేశీ ప్రయాణాలకు, ఉన్నత విద్యకు ఇది సరైన సమయం. వృత్తిలో స్థిరత్వం ఉంటుంది కానీ ఏకాగ్రత అవసరం.
వృశ్చిక రాశి
ఆదాయం: 11 వ్యయం: 5 రాజపూజ్యం: 2 అవమానం: 6
వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది మిశ్రమంగా ఉన్నా దైవబలం రక్షిస్తుంది. జూన్ వరకు ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉన్నా.. జూన్ 2 తర్వాత భాగ్య స్థానానికి గురువు రావడంతో ఉచ్చస్థితి మొదలవుతుంది. గృహ వాతావరణంలో ప్రశాంతత లోపించకుండా చూసుకోవాలి. పిల్లల చదువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ధనస్సు రాశి
ఆదాయం: 14 వ్యయం: 11 రాజపూజ్యం: 5 అవమానం: 6
ధనస్సు రాశి వారికి అన్ని విధాలా అనుకూలమైన సంవత్సరం. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల పని ఒత్తిడి, మానసిక ప్రశాంతత లోపం ఉండవచ్చు, కాబట్టి సహనం కోల్పోకూడదు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రాహువు పరాక్రమ స్థానంలో ఉండటం వల్ల ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. శక్తికి మించిన వాగ్దానాలు చేయవద్దు.
మకర రాశి
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 1 అవమానం: 2
మకర రాశి వారికి ఈ ఏడాది జీవితంలో గొప్ప మలుపులు ఉంటాయి. గతంలో అనుభవించిన కష్టాలకు ముగింపు లభిస్తుంది. ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. జూన్ నుండి అక్టోబరు మధ్య కాలం వివాహానికి, దాంపత్య బంధానికి చాలా బాగుంది. వ్యాపారులకు, విద్యార్థులకు లాభదాయకంగా ఉంటుంది.
కుంభ రాశి
ఆదాయం: 2 వ్యయం: 8 రాజపూజ్యం: 4 అవమానం: 2
కుంభ రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రభావం వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఉంటుంది. అయితే జూన్ వరకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల దైవానుగ్రహం లభిస్తుంది. లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జూన్ తర్వాత రుణ సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి
ఆదాయం: 14 వ్యయం: 11 రాజపూజ్యం: 7 అవమానం: 2
మీన రాశి వారికి జన్మశని ప్రభావం ఉన్నందున అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. నిద్రలేమి, వృథా ఖర్చుల వల్ల ఇబ్బందులు రావచ్చు. అయితే రాహువు లాభ స్థానానికి రావడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది.
Follow Us