పోలవరంపై జగన్ చేతులు ఎత్తేశారు.. జనసేన కౌంటర్

గత రెండు రోజుల నుంచి పోలవరం ప్రాజెక్టు చుట్టూ ఏపీ రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేయగా.. సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.

New Update
పోలవరంపై జగన్ చేతులు ఎత్తేశారు.. జనసేన కౌంటర్

ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ సందర్శించి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్ర భవిష్యత్ మార్చే ప్రాజెక్టును వైసీపీ సర్కార్ పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్‌తో పాటు నీటిపారుదలశాఖ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా 2025 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తిచేస్తామని సీఎం జగన్ తాజాగా ప్రకటించారు. దీనిపై జనసేన పార్టీ విమర్శలు చేస్తూ ట్వీట్ చేసింది.

నిన్న మొన్నటి వరకు పోలవరం కట్టేది తానే.. నిధులు తెచ్చేది తానే అని బీరాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ తాజాగా మాట మార్చారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. సోమవారం పోలవరం ముంపు నిర్వాసిత ప్రాంతాల పర్యటన సందర్భంగా పోలవరం నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద తోసేశారన్నారు. పోలవరం కట్టేది కేంద్రమేనని అక్కడ నుంచి డబ్బులు రావాలని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తును 41.15 మీటర్ల ఎత్తుకు తగ్గించేందుకు ఒప్పుకున్న జగన్, పునరావాసం, పరిహారం విషయంలోనూ నిర్వాసితులను మోసం చేసేందుకు కొత్త పన్నాగం పన్నారని వ్యాఖ్యానించారు.

పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేసిన ఈ ముఖ్యమంత్రి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి... మాకు కరెన్సీ ముద్రించే అవకాశం లేదు కదా అంటూ కొత్త కథలు చెబుతున్నారని విమర్శలు చేశారు. జగన్ తీరు ఎలా ఉందంటే అవకాశం ఇస్తే ఆయనే కరెన్సీ ప్రింట్ చేసుకొని జె కరెన్సీ అని పెట్టుకొనేవారేమో అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పునరావాస కాలనీలు నిర్మిస్తామని నిన్న మొన్నటి వరకు చెప్పిన ముఖ్యమంత్రి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. తాను పోలవరం మొదలుపెట్టి ఉంటే పునరావాసం పూర్తి చేసేవాడిని అంటూ కొత్త మోసానికి తెర లేపారన్నారు.

బాధితులకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో చేతులు ఎత్తేశారని.. ఇది వైసీపీ చేస్తున్న మహా మోసమని వెల్లడించారు. మంగళవారం గుంటూరులో జరిగిన పార్టీ నగర కమిటీ సర్వసభ్య సమావేశంలో నాదెండ్ల ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పోలవరంపై జగన్ మార్చిన మాటలు అంటూ జనసేన పార్టీ కూడా ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు