/rtv/media/media_files/2026/05/27/trump-netanyahu-talk-amid-the-us-iran-deal-2026-05-27-14-34-16.jpg)
Trump-Netanyahu talk amid the US-Iran deal?
Middle East War Ceasefire : పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్)లో మూడు నెలలుగా సాగుతున్న యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరుగుతున్నప్పటికీ, ఇరుపక్షాలు ఒక ఖచ్చితమైన ఒప్పందానికి రాలేకపోతున్నాయి. ఒకవైపు హెచ్చరికలు, మరోవైపు చర్చలు సమాంత రంగా సాగుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక స్థావరాల్లో అమెరికా యుద్ధ విమానాలు సిద్ధంగా ఉంటే, మరోవైపు ఖతార్‌లో శాంతి ఒప్పంద నిబంధనలపై రహస్య చర్చలు నడుస్తున్నాయి. అసలు భవిష్యత్తులో ఏం జరగబోతోంది? శాంతి ఒప్పందమా లేక యుద్ధంలో రెండో అంకమా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
గడిచిన 48 గంటల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అమెరికానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తుండగా, దక్షిణ ఇరాన్‌లోని క్షిపణి స్థావరాలు, కొన్ని పడవలను తాము టార్గెట్ చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) స్పష్టం చేసింది. అంతర్జాతీయ నౌకలకు ముప్పు కలిగించేలా ఆ పడవలు సముద్రంలో మైన్లు (బాంబులు) అమర్చుతున్నందుకే దాడి చేశామని అమెరికా వాదిస్తోంది. దీనికి ప్రతిచర్యగా, తమ వాయుసేన సరిహద్దుల్లోకి దూసుకొచ్చిన అమెరికా యుద్ధ విమానాలను ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అడ్డుకున్నాయి. అమెరికా చట్టవిరుద్ధమైన, కచ్చితమైన కాలాన్ని ఉల్లంఘించే పనులు చేస్తోందని, ఏలాంటి దాడికైనా బదులివ్వడానికి తాము సిద్ధమని ఇరాన్ విదేశాంగ శాఖ హెచ్చరించింది.
తాజా పరిణామాలు:
1. ట్రంప్-నెతన్యాహు ఫోన్ సంభాషణ
మారిన పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యంత కీలకమైన ఫోన్ సంభాషణ జరిపారు. ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు,మిడిల్ ఈస్ట్‌లో భద్రతా పరిస్థితులపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఎయిర్ బేస్‌లలో అమెరికా యుద్ధ విమానాలు ల్యాండ్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2. క్యాంప్ డేవిడ్ పర్యటన రద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అధికారిక 'క్యాంప్ డేవిడ్' పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. వాతావరణం సరిగ్గా లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నప్పటికీ, ఈ రోజు వైట్‌హౌస్‌లో అత్యవసర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఇరాన్-మిడిల్ ఈస్ట్ సంక్షోభంపైనే ప్రధానంగా చర్చించనున్నారు.
3. మార్కో రూబియో కీలక ప్రకటన
భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ ఉద్రిక్తతలపై సానుకూలంగా స్పందించారు. ఇరు దేశాల మధ్య దాడులు జరుగుతున్నప్పటికీ, ఇరాన్‌తో కుదరాల్సిన శాంతి ఒప్పంద అవకాశాలు ఇంకా మూసుకుపోలేదని ఆయన అన్నారు. ఇరు దేశాలు శాంతి వైపే మొగ్గు చూపుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
4. ఖతార్‌లో రహస్య చర్చలు
ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, ముసాయిదా భాషపై ఖతార్ వేదికగా ఇరుపక్షాల మధ్య రహస్య చర్చలు నిరంతరం కొనసాగుతున్నాయని మార్కో రూబియో తెలిపారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
5. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు
మరోవైపు లెబనాన్‌లో పరిస్థితి మరింత చేయి దాటుతోంది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా వైమానిక దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా కనీసం 31 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
6. హిజ్బుల్లాపై గ్రౌండ్ ఆపరేషన్ తీవ్రతరం
దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా తాము చేపట్టిన భూతల అధీన చర్యలను (Ground Operation) మరింత వేగవంతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇటు హిజ్బుల్లా సైతం తమ పోరాట యోధులు ఇజ్రాయెల్ సైన్యంతో ముఖాముఖి తలపడుతున్నారని స్పష్టం చేసింది.
7. ఇరాన్‌లో ఇంటర్నెట్ పునరుద్ధరణ
దాదాపు మూడు నెలల సుదీర్ఘ డిజిటల్ లాక్‌డౌన్ తర్వాత ఇరాన్ ప్రభుత్వం దేశంలో ఇంటర్నెట్ సేవలను పాక్షికంగా పునరుద్ధరించడం ప్రారంభించింది. యుద్ధ సమయంలో భద్రతా కారణాల రీత్యా ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ఇంటర్నెట్ బ్లాకౌట్‌ను ఇరాన్ విధించింది. ప్రస్తుతం పరిస్థితి కుదుటపడుతుండటంతో నెమ్మదిగా సేవలు పునరుద్ధరిస్తున్నారు.
8. రంగంలోకి ఖతార్ అమీర్
ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ నేరుగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో పరిస్థితులు మరింత విషమించకుండా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. గతంలో గల్ఫ్ యుద్ధ సమయంలో ఖతార్‌పై ఇరాన్ దాడులు చేసినప్పటికీ, వాటన్నింటినీ పక్కనపెట్టి ప్రాంతీయ శాంతి కోసం ఖతార్ ప్రస్తుతం మధ్యవర్తిగా కీలక పాత్ర పోషిస్తోంది.
Follow Us