/rtv/media/media_files/2026/05/01/donald-trump-2026-05-01-10-56-02.jpg)
మే 1వ తేదీ నుండి అమెరికా తిరిగి ఇరాన్‌పై దాడికి దిగనుందా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. దీనికి కారణం, యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాంగ్రెస్ నుండి అనుమతి తీసుకోవాల్సిన గడువు ముగియడమే. అయితే ట్రంప్ రాజ్యాంగ సంప్రదాయాలను పాటిస్తారా లేక తన ఇష్టానుసారం వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. నిక్సన్ నుండి ఒబామా వరకు ప్రతి అధ్యక్షుడికి సవాలుగా మారిన ఈ వార్ పవర్స్ యాక్ట్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మే 2 నాటికి సరిగ్గా 60 రోజులు
అమెరికా ఫిబ్రవరి 28న ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించింది. దీనిపై అమెరికా పార్లమెంటుకు మార్చి 2న అధికారికంగా సమాచారం అందించారు. ఈ లెక్కన మార్చి 2 నుండి మే 2 నాటికి సరిగ్గా 60 రోజులు పూర్తవుతాయి. అమెరికాలోని వార్ పవర్స్ రిజల్యూషన్ చట్టం ప్రకారం, యుద్ధం కొనసాగించాలంటే ఈ 60 రోజుల గడువు అత్యంత కీలకం. మార్చి 2 నుండి లెక్కించినట్లయితే, మే 1వ తేదీ లోపు ట్రంప్ ప్రభుత్వం పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది.
1973లో అమలులోకి వచ్చిన ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అధ్యక్షుడి యుద్ధ అధికారాలను పరిమితం చేయడం, కాంగ్రెస్ పాత్రను బలోపేతం చేయడం. ఒకవేళ అధ్యక్షుడు పార్లమెంటు అనుమతి లేకుండా సైన్యాన్ని ప్రయోగిస్తే, దానికి సంబంధించిన అనుమతిని 60 రోజుల్లోగా పొందాలి. ఒకవేళ అనుమతి లభించకపోతే, చట్టం ప్రకారం సైనిక చర్యను నిలిపివేయాల్సి ఉంటుంది.
ఈ యుద్ధాన్ని కొనసాగించడానికి అమెరికా ప్రతినిధుల సభ, సెనేట్ రెండింటిలోనూ సాధారణ మెజారిటీ అవసరం. అయితే, ఇప్పటివరకు ఈ చర్యకు ఎటువంటి అధికారిక ఆమోదం లభించలేదు. అమెరికన్ మీడియా నివేదికల ప్రకారం, ట్రంప్ సొంత పార్టీకి చెందిన కనీసం 10 మంది ఎంపీలు ఈ యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనివల్ల మెజారిటీ సాధించడం ట్రంప్‌కు కత్తిమీద సాములా మారింది.
చరిత్రను పరిశీలిస్తే, నిక్సన్, రోనాల్డ్ రీగన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బిల్ క్లింటన్, ఒబామా స్వయంగా ట్రంప్ కూడా ఈ చట్టాన్ని గతంలో పట్టించుకోలేదు. జాతీయ భద్రత,అత్యవసర సైనిక చర్యల విషయంలో ఈ చట్టం అధ్యక్షుడి రాజ్యాంగ అధికారాలలో జోక్యం చేసుకుంటుందని వారి వాదన. ఒకవేళ కాంగ్రెస్ నుండి అనుమతి లభించకపోయినా, జాతీయ భద్రతను సాకుగా చూపి ట్రంప్ యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికాలోని కార్యనిర్వాహక వ్యవస్థ,శాసన వ్యవస్థ మధ్య తీవ్ర స్థాయి ఘర్షణ ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. మే 1 తర్వాత ట్రంప్ అడుగులు ఎటువైపు పడతాయో వేచి చూడాలి.
Follow Us