West Asian crisis : పశ్చిమాసియా సంక్షోభం..పొదుపు మంత్రం జపిస్తున్న ప్రపంచం..ఏం చేస్తున్నాయో తెలుసా?

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, ఆర్థిక అనిశ్చితి ఏర్పడటంతో అనేక దేశాలు 'పొదుపు' బాట పట్టాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాలు గత నెల రోజులుగా కఠినమైన పొదుపు చర్యలను అమలు చేస్తున్నాయి.

New Update
FotoJet - 2026-05-14T113458.254

Savings

West Asian crisis : పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు ఆకాశాన్ని తాకడం, ఆర్థిక అనిశ్చితి ఏర్పడటంతో అనేక దేశాలు 'పొదుపు' బాట పట్టాయి. కేవలం భారత్ మాత్రమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 దేశాలు గత నెల రోజులుగా కఠినమైన పొదుపు చర్యలను అమలు చేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన విధంగానే, వనరులను పొదుపు చేస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఆయా దేశాలు వినూత్న చర్యలు చేపట్టాయి.

అనేక దేశాలు విద్యాసంస్థలు, కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేశాయి. విద్యుత్, ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి పలు దేశాలు పనిదినాలను కుదించాయి.

పాఠశాలలు: శ్రీలంక, పెరూ, బంగ్లాదేశ్‌లు పాఠశాల పనిదినాలను తగ్గించి, ఆన్‌లైన్ లెర్నింగ్‌ను (Remote Learning) ప్రోత్సహిస్తున్నాయి.

పనిదినాల కుదింపు: పాకిస్థాన్, ఫిలిప్పీన్స్‌ దేశాలు ప్రభుత్వ అధికారులకు వారానికి 4 రోజుల పనిదినాలను మాత్రమే అమలు చేస్తున్నాయి. పాకిస్థాన్‌లో మరో అడుగు ముందుకేసి 4 రోజుల పనితో పాటు 50 శాతం రిమోట్ వర్క్ విధానాన్ని తెచ్చారు.

సెలవులు: శ్రీలంకలో బుధవారాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. ఇండొనేసియాలో శుక్రవారం, మయన్మార్‌లో బుధవారం 'వర్క్ ఫ్రమ్ హోమ్' తప్పనిసరి చేశారు.

చాలా దేశాలు విద్యుత్ వినియోగంపై ఆంక్షలు (ఏసీ & లైటింగ్) విధించాయి. విద్యుత్ ఆదా కోసం ఆసియా దేశాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.

ఏసీ సెట్టింగ్స్: బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, మసీదుల్లో ఏసీలను కనీసం 25°C లేదా అంతకంటే ఎక్కువకు సెట్ చేయాలని ఆదేశించారు. కంబోడియా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్‌లలో కూడా ఇవే నిబంధనలు ఉన్నాయి.

లైటింగ్: శ్రీలంకలో విద్యుత్ ఆదా కోసం వ్యాపార ప్రకటనల బోర్డుల (Billboards) పై లైట్లను ఆపేస్తున్నారు.

జోర్దాన్: ప్రభుత్వ భవనాల్లో ఏసీల వినియోగాన్ని భారీగా తగ్గించారు.

 
ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించుకోవడానికి పలు దేశాలు రవాణా రంగంలో మార్పులు తెచ్చాయి.  జోర్దాన్, పాకిస్థాన్‌లు ప్రభుత్వ అధికారుల అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాయి. విదేశీ ప్రతినిధులకు ఇచ్చే ఆతిథ్య ఖర్చులను కూడా జోర్దాన్ తగ్గించింది. దక్షిణ కొరియాలో ట్రాఫిక్ , ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి వాహనాలకు సరి-బేసి (Odd-Even) విధానాన్ని అమలు చేస్తున్నారు. బ్రిటన్‌లో చిన్న వ్యాపారులు ఎలక్ట్రిక్ హీటింగ్‌కు మారడానికి 'బాయిలర్ అప్‌గ్రేడ్' పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు.

 కొన్ని దేశాలు ప్రజలను భాగస్వామ్యం చేస్తూ   స్వచ్ఛంద పొదుపు ప్రచారాలు చేస్తూ అవగాహన కల్పిస్తున్నాయి.
ఆస్ట్రేలియా: ఇక్కడ ‘ఎవ్రీ లిటిల్ బిట్ హెల్ప్స్’ (Every Little Bit Helps) పేరుతో ఒక పెద్ద ప్రచారాన్ని చేపట్టారు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా ఇంధనాన్ని, విద్యుత్తును పొదుపు చేసేలా ప్రోత్సహిస్తోంది.
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, ప్రపంచ దేశాల బడ్జెట్‌లను తలకిందులు చేస్తోంది. ఈ క్రమంలో వర్క్ ఫ్రమ్ హోమ్, రిమోట్ లెర్నింగ్, ఏసీ వినియోగంపై నియంత్రణ వంటి చర్యలు ఇప్పుడు ఒక అనివార్యమైన 'గ్లోబల్ ట్రెండ్'గా మారాయి.

Advertisment
తాజా కథనాలు