/rtv/media/media_files/2026/05/18/afanistan-2026-05-18-12-24-55.jpg)
అఫ్గానిస్తాన్‌లో మహిళలు, బాలికల హక్కులను కాలరాస్తూ తాలిబాన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. వివాహం, విడాకులు, బాల్య వివాహాలకు సంబంధించి ప్రిన్సిపల్స్ ఆఫ్ సెపరేషన్ బిట్వీన్ స్పౌసెస్ పేరుతో ఒక కొత్త కుటుంబ చట్టాన్ని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించారు. 31 ఆర్టికల్స్‌తో కూడిన ఈ కొత్త నిబంధనలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ కొత్త చట్టంలోని నిబంధనలు బాలికల స్వేచ్ఛను, హక్కులను పూర్తిగా సమాధి చేసేలా ఉన్నాయని హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు.
పెళ్లికి అంగీకారంగా
ఒక బాలిక యుక్తవయస్సుకు వచ్చిన తర్వాత, ఆమెకు వివాహం నిశ్చయించినప్పుడు ఆమె గనుక మౌనంగా ఉంటే.. దానిని పెళ్లికి అంగీకారంగానే పరిగణిస్తారు. అయితే, ఇదే నిబంధన అబ్బాయిలకు లేదా గతంలో వివాహమైన మహిళలకు వర్తించదు. వారు కచ్చితంగా నోటితో తమ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది.
మైనర్ బాలికలకు వివాహాలు చేసే పూర్తి అధికారాలను తండ్రి, తాతలకు కట్టబెట్టారు. ఒకవేళ తండ్రి, తాతలు కాకుండా ఇతర బంధువులు ఎవరైనా మైనర్లకు వివాహం జరిపిస్తే.. సదరు వరుడు సామాజికంగా తగినవాడై, కట్నకానుకలు సంతృప్తికరంగా ఉంటే ఆ వివాహాన్ని చట్టబద్ధంగానే గుర్తిస్తారు.
బాల్యంలో పెళ్లిళ్లు జరిగిన వారు, పెద్దయ్యాక ఆ వివాహాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే ఖియార్ అల్-బులూగ్ అనే ఇస్లామిక్ చట్టాన్ని ప్రస్తావించారు. కానీ, ఈ రద్దు ప్రక్రియ అంత సులువు కాదు. వివాహాన్ని రద్దు చేయాలన్నా తాలిబాన్ కోర్టుల ఆమోదం తప్పనిసరి. అలాగే సంరక్షకులు వేధింపులకు పాల్పడినా, నైతికంగా దిగజారినట్లు నిరూపితమైతేనే తాలిబాన్ న్యాయమూర్తులు జోక్యం చేసుకుంటారు.
2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే మహిళల ఉన్నత విద్యపై నిషేధం, ఉద్యోగాలపై ఆంక్షలు, పబ్లిక్ లైఫ్‌లో మహిళల భాగస్వామ్యాన్ని తగ్గించడం వంటి చర్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.
Follow Us