US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం? 14 ఒప్పందాలు ఇవే!

పశ్చిమ ఆసియాలో గత మూడున్నర నెలలుగా (107 రోజుల పాటు) కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణానికి, తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ప్రాథమిక శాంతి ఒప్పందానికి వచ్చాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య 14 ఒప్పందాల మీద అంగీకారం కుదిరింది.

New Update
trump

US-Iran Peace Deal

14-Point Draf : పశ్చిమ ఆసియాలో గత మూడున్నర నెలలుగా (107 రోజుల పాటు) కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణానికి, తీవ్ర ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ దేశాలు ఒక ప్రాథమిక శాంతి ఒప్పందానికి (Preliminary Peace Agreement) వచ్చాయి. ఈ చారిత్రాత్మక డీల్‌తో ప్రపంచవ్యాప్తంగా దీనిపై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడ్డారా? లేక ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసిందా? అనే చర్చలు అంతర్జాతీయంగా ఊపందుకున్నాయి.

మధ్యవర్తిగా వ్యవహరించిన పాకిస్థాన్ ద్వారా వెల్లడైన ఈ ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని వాషింగ్టన్, టెహ్రాన్ అధికారులు ధృవీకరించారు. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో ఇరు దేశాలు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికారికంగా సంతకాలు చేయనున్నాయి. ఈ అవగాహన ఒప్పందం (MoU) పూర్తి పాఠం ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ, ఇరాన్ చర్చల బృందానికి అత్యంత సన్నిహితంగా ఉన్న ఒక కీలక వనరును ఉటంకిస్తూ ఇరాన్‌కు చెందిన 'మెహర్ న్యూస్ ఏజెన్సీ' (Mehr News Agency) ఈ ముసాయిదాలోని 14 సూత్రాల (14-Point Draft) వివరాలను లీక్ చేసింది.

సంక్షోభం నేపథ్యం

గత కొన్ని నెలలుగా ఇరాన్, లెబనాన్ దేశాల్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న తీవ్ర ఘర్షణల నేపథ్యంలో ఈ ఒప్పందం కుదిరింది. ఈ యుద్ధ సమయంలో ఇరాన్ వ్యూహాత్మక 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని పూర్తిగా దిగ్బంధించగా, ప్రతిచర్యగా అమెరికా దళాలు ఇరాన్ నౌకాశ్రయాలను ముట్టడించాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఇంధన సంక్షోభానికి, చమురు ధరల భారీ పెరుగుదలకు దారితీసింది. తాజా ఒప్పందంలో భాగంగా ఈ జలసంధిని తిరిగి తెరవడంతో పాటు, టెహ్రాన్ అణు కార్యక్రమంపై సరికొత్త చర్చలు ప్రారంభించేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి.

 ‘14 సూత్రాల’ ముసాయిదా ఒప్పంద నిబంధనలు ఇవే

తక్షణ కాల్పుల విరమణ: లెబనాన్ సహా ఇరాన్ మిత్రపక్షాలన్నింటిపై (అన్ని యుద్ధ రంగాలలో) తక్షణమే, శాశ్వతంగా యుద్ధాన్ని ముగించాలి.

సార్వభౌమత్వానికి గౌరవం: ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకోకూడదని, ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని హామీ ఇవ్వాలి.

నౌకాదళ ముట్టడి తొలగింపు: ఇరాన్ రేవులపై విధించిన అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని (Naval Blockade) 30 రోజుల్లోగా పూర్తిగా ఎత్తివేయాలి.

దళాల ఉపసంహరణ: ఇరాన్ చుట్టుపక్కల సరిహద్దుల ప్రాంతాల నుంచి తన సైనిక దళాలను పూర్తిగా వెనక్కి రప్పిస్తామని అమెరికా హామీ ఇవ్వాలి.

హార్ముజ్ జలసంధి పునఃప్రారంభం: ఇరాన్ పర్యవేక్షణ మరియు ఏర్పాట్ల ప్రకారం 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధిని 30 రోజుల్లోగా అంతర్జాతీయ రవాణా కోసం తిరిగి తెరవాలి.

ఆంక్షల ఎత్తివేత: ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ విక్రయాలపై ఉన్న ఆంక్షలను సస్పెండ్ చేయాలి. వీటి ద్వారా వచ్చే ఆర్థిక లబ్ధి పూర్తిగా ఇరాన్‌కు అందేలా మార్గం సుగమం చేయాలి.

రూ. 25 లక్షల కోట్ల పునర్నిర్మాణ ప్యాకేజీ: యుద్ధం వల్ల దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కనీసం 300 బిలియన్ డాలర్ల (సుమారు ₹25 లక్షల కోట్లు) ప్రణాళికను సమర్పించాలి.

60 రోజుల చర్చల గడువు: అణు సమస్యపై తుది ఒప్పందానికి రావడానికి, అమెరికా విధించిన ప్రాథమిక, ద్వితీయశ్రేణి ఆంక్షలతో పాటు ఐరాస, ఐఏఈఏ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ తీర్మానాలను శాశ్వతంగా తొలగించడానికి 60 రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరపాలి.

అణ్వాయుధాల తయారీ నిలిపివేత: తాము అణ్వాయుధాలను తయారు చేయడం లేదంటూ అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) పరిధిలోని తన నిబద్ధతను ఇరాన్ పునరుద్ఘాటించాలి.

అదనపు దళాలపై నిషేధం: 60 రోజుల చర్చల వ్యవధిలో పశ్చిమ ఆసియా ప్రాంతానికి అదనపు దళాలను పంపబోమని, ఇరాన్‌పై ఎలాంటి కొత్త ఆంక్షలు విధించబోమని అమెరికా హామీ ఇవ్వాలి.

$24 బిలియన్ల నిధుల విడుదల: అమెరికా స్తంభింపజేసిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల నిధులను ఈ 60 రోజుల్లో విడుదల చేయాలి. అందులో సగం నిధులను ($12 బిలియన్లు) చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇవ్వాలి.

పర్యవేక్షణ యంత్రాంగం: ఈ శాంతి ఒప్పంద నిబంధనల అమలును నిశితంగా పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక అంతర్జాతీయ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.

ఐరాస ఆమోదం: తుది శాంతి ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తీర్మానం ద్వారా అధికారికంగా ఆమోదించాలి.

తుది చర్చల ఎజెండా పరిమితి: ఇరాన్ నిధుల విడుదల, చమురు ఆంక్షల సస్పెన్షన్, నౌకాదళ ముట్టడి తొలగింపు పూర్తయిన తర్వాతే తుది చర్చలు ప్రారంభం కావాలి. ఈ చర్చలు కేవలం యురేనియం సుసంపన్నత (Enrichment), ఆర్థిక పునర్నిర్మాణంపైనే జరగాలి. ఇరాన్ క్షిపణి కార్యక్రమం (Missile Programme), ప్రాంతీయ నిరోధక గ్రూపులకు ఇరాన్ ఇచ్చే మద్దతును ఈ చర్చల ఎజెండా నుండి పూర్తిగా మినహాయించాలి.

ముందున్న సవాళ్లు

ఈ ముసాయిదా ఒప్పందాన్ని తమ దేశంలోని ఉన్నత స్థాయి సంస్థలు పూర్తిగా సమీక్షించి, ఆమోదించాల్సి ఉందని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. ఆర్థిక ఉపశమనమే ఈ ఒప్పందంలో కీలకమని 'మెహర్' సంస్థ పేర్కొంది. విస్తృత ఒప్పందానికి ఇవే పునాదులని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ మొత్తం వ్యవహారంపై ఇటు అమెరికా మిత్రదేశమైన ఇజ్రాయెల్ ప్రస్తుతం మౌనంగా ఉండటం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు