అమెరికాలో 'బర్త్ రైట్' పౌరసత్వానికి బ్రేక్? భారతీయ టెక్కీల్లో మొదలైన వణుకు!

అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వం గట్టిగా వాదించింది. దీంతో అమెరికాలో వారి పిల్లలకు పౌరసత్వం కోసం కలలు కంటున్న ఇండో అమెరికన్స్ ఆశలు ఆవిరి కానున్నాయి.

New Update
US government

అమెరికాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 'జన్మహక్కు పౌరసత్వం'పై ట్రంప్ సర్కార్ ఇచ్చిన షాక్‌కు ప్రవాస భారతీయులను ఆందోళనకు గురిచేస్తోంది. పిల్లల ఫ్యూచర్ కోసం అగ్రరాజ్యంలో తిప్పలు పడుతున్న NRIలు భయంతో వణుకుతున్నారు. అమెరికా ప్రభుత్వం ఏప్రిల్ 2న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో కీలక వాదనలు వినిపించింది. అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉన్నవారికి పుట్టే పిల్లలకు పౌరసత్వం ఇచ్చే నిబంధనను రద్దు చేయాలని ప్రభుత్వం గట్టిగా వాదించింది. దీంతో అమెరికాలో వారి పిల్లలకు పౌరసత్వం కోసం కలలు కంటున్న ఇండో అమెరికన్స్ ఆశలు ఆవిరి కానున్నాయి.

ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. తల్లిదండ్రులిద్దరిలో కనీసం ఒక్కరైనా అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్లు కాకపోతే, అక్కడ జన్మించిన బిడ్డకు పౌరసత్వం లభించదు. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సుప్రీంకోర్టులో సొలిసిటర్ జనరల్ జాన్ సౌర్ ప్రభుత్వ వాదనను వినిపించారు. 14వ రాజ్యాంగ సవరణ అందరికీ వర్తించదని, కేవలం అమెరికా పట్ల 'ప్రత్యక్ష విధేయత' ఉన్నవారికి మాత్రమే పౌరసత్వం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.

భారతీయులపై ప్రభావం ఎంత?

ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
H-1B హోల్డర్ల ఫ్యూచర్: అమెరికాలో H-1B వీసాపై ఉన్నవారిలో అత్యధిక శాతం భారతీయులే. వీరు గ్రీన్ కార్డ్ కోసం దశాబ్దాల తరబడి వెయిట్ చేస్తున్నారు.
పిల్లల హోదా: ఇప్పటివరకు అమెరికాలో పుట్టిన భారతీయ పిల్లలు సహజంగానే అమెరికన్ పౌరులుగా గుర్తింపు పొందేవారు. కొత్త నిబంధన అమల్లోకి వస్తే, వారు కూడా తమ తల్లిదండ్రుల వలె 'తాత్కాలిక నివాసితులు'గానే మిగిలిపోతారు.
వివక్ష : విద్య, ఉపాధి, సామాజిక భద్రతా పథకాల విషయంలో ఈ పిల్లలు తీవ్ర వివక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చారిత్రక తీర్పులకు తూట్లు?

ప్రభుత్వ వాదనను వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు 1898 నాటి 'యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ వాంగ్ కిమ్ ఆర్క్' తీర్పును గుర్తు చేస్తున్నారు. అమెరికా గడ్డపై ఎవరు జన్మించినా వారు పౌరులేనన్న ఆ తీర్పును ఇప్పుడు తలకిందులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని వారు వాదిస్తున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దీని అమలుపై సందేహాలు వ్యక్తం చేశారు. పుట్టగానే ఒక బిడ్డ పౌరసత్వాన్ని నిర్ధారించడం ఆచరణలో ఎంతవరకు సాధ్యమని వారు ప్రశ్నించారు.

ట్రంప్ ప్రభుత్వం తన వాదనలో భాగంగా.. ఈ నిబంధన కేవలం భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసినప్పటికీ, ఇండియన్ ఫ్యామిలీస్‌లో నెలకొన్న భయం మాత్రం తగ్గడం లేదు. ఒకవేళ సుప్రీంకోర్టు గనుక ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిస్తే, అది అమెరికా వలస విధానంలోనే అతిపెద్ద మలుపుగా మారుతుంది. పౌరసత్వం అనేది హక్కుగా కాకుండా, కేవలం ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే అంశంగా మారిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisment
తాజా కథనాలు