/rtv/media/media_files/2026/04/24/h-1b-visa-2026-04-24-14-33-40.jpg)
Federal judge voids Trump's H-1B visa requirements
Federal judge : అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే తాత్కాలిక వలస వీసా అయిన హెచ్-1బీ ఫీజు పెంపు వ్యవహారంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఏకంగా ఒక లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ సర్కారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని బోస్టన్‌లోని ఫెడరల్ కోర్టు పూర్తిగా కొట్టేసింది. ఈ మేరకు యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరొకిన్ సోమవారం కీలక తీర్పును వెలువరించారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
గతంలో హెచ్-1బీ వీసా దరఖాస్తులకు సాధారణంగా 2 వేల డాలర్ల నుంచి 5 వేల డాలర్ల వరకు ఫీజు ఉండేది. అయితే, విదేశీ ఉద్యోగుల రాకను అడ్డుకునే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం గత సెప్టెంబరులో ఈ ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమెరికాలోకి విదేశీయుల రాకను నియంత్రించడానికి ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి ఉన్న అధికారాల పరిధిలోనే ఈ ఆర్థిక జరిమానా (పెనాల్టీ) విధించామని ట్రంప్ సర్కారు కోర్టులో వాదించింది. అయితే, ఈ పెంపును సవాలు చేస్తూ డెమొక్రటిక్ పార్టీకి చెందిన 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ బోస్టన్ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన జడ్జి లియో సొరొకిన్.. ట్రంప్ ప్రభుత్వ వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. ప్రభుత్వం విధించిన ఈ భారీ మొత్తం కేవలం జరిమానా కాదని, అది ముమ్మాటికీ ఒక 'పన్ను' కిందకే వస్తుందని ఆయన తేల్చిచెప్పారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు (కాంగ్రెస్) ఆమోదం లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా ఇలాంటి పన్నులపై నిర్ణయం తీసుకోలేరని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనుమతి లేనందున దీనిని చట్టవిరుద్ధమైన పన్నుగా పరిగణిస్తూ, ఈ ఫీజు పెంపు చెల్లదని జడ్జి తీర్పునిచ్చారు. సుంకాల పెంపు విషయంలో ఇప్పటికే కోర్టుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న ట్రంప్ యంత్రాంగానికి ఈ తీర్పు మరో పెద్ద షాక్‌గా మారింది.
Follow Us