China : చైనా సీక్రెట్ పోలీస్ స్టేషన్ కేసు.. ఏజెంట్ అడ్డంగా దొరికిపోయాడు!

అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్‌వాంగ్‌ (64)ను దోషిగా నిర్ధారించింది.

New Update
china

అమెరికా గడ్డపై చైనా ప్రభుత్వం రహస్యంగా ‘పోలీస్ స్టేషన్’ నిర్వహిస్తోందన్న ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని ఒక ఫెడరల్ కోర్టు, ఈ కేంద్రం నిర్వహణలో కీలక పాత్ర పోషించిన అమెరికా పౌరుడు లూ జియాన్‌వాంగ్‌ (64)ను దోషిగా నిర్ధారించింది. హ్యారీ లూ గా పిలవబడే ఇతను, చైనా ప్రజా భద్రతా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు అమెరికాలో అక్రమ ఏజెంట్‌గా వ్యవహరించాడని జ్యూరీ స్పష్టం చేసింది.

న్యూయార్క్‌లోని మన్హట్టన్ ప్రాంతంలో ఉన్న ఒక రామెన్ స్టాల్ పై అంతస్తులో 2022 ఆరంభంలో ఈ రహస్య పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ఎఫ్బీఐకి ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే 2022 చివరి నాటికి ఈ కేంద్రాన్ని మూసివేశారు.

ఈ కేసులో లూతో పాటు చెన్ జిన్‌పింగ్ అనే మరో వ్యక్తిపై కూడా ఆరోపణలు వచ్చాయి. ఎఫ్బీఐ తమపై నిఘా పెట్టిందని తెలియగానే, వీరిద్దరూ చైనా అధికారులతో జరిపిన చాటింగ్, టెక్స్ట్ మెసేజ్‌లను డిలీట్ చేసి సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ప్రాసిక్యూటర్లు కోర్టుకు వివరించారు. ఈ కేసులో రెండో నిందితుడైన చెన్ జిన్‌పింగ్, తాను చైనా ఏజెంట్‌గా పనిచేశానని డిసెంబర్ 2024లోనే కోర్టులో అంగీకరించాడు.

అమెరికాలో ఉంటూ చైనా ప్రభుత్వంపై విమర్శలు చేసేవారు, ప్రజాస్వామ్య మద్దతుదారులు,  అసమ్మతివాదుల కార్యకలాపాలపై నిఘా పెట్టడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఎఫ్బీఐ అసిస్టెంట్ డైరెక్టర్ జేమ్స్ సి. బార్నాకిల్ జూనియర్ తెలిపారు. విదేశాల్లో ఉంటున్న తమ పౌరులను భయభ్రాంతులకు గురిచేయడానికి చైనా ఇలాంటి వ్యవస్థలను వాడుకుంటోందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

సుమారు 53 దేశాలలో

వివిధ నివేదికల ప్రకారం, ప్రపంచంలోని సుమారు 53 దేశాలలో చైనాకు చెందిన ఇలాంటి 100కు పైగా రహస్య అవుట్‌పోస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఆరోపణలను బీజింగ్ తీవ్రంగా ఖండిస్తోంది. అవి గూఢచారి కేంద్రాలు కావని, విదేశాల్లో నివసిస్తున్న తమ పౌరులకు పరిపాలనాపరమైన,  పత్రాల సంబంధిత సహాయం అందించే సర్వీస్ స్టేషన్లు మాత్రమేనని చైనా వాదిస్తోంది.ఈ తీర్పుతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న అమెరికా-చైనా సంబంధాలు మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు