Mojtaba Khamenei : యురేనియం నిల్వలు ఎవరికీ ఇచ్చేదే లేదు.. అమెరికాకు సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కౌంటర్!

తమ దేశంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశాలకు పంపే ప్రసక్తే లేదని, అవన్నీ ఇరాన్‌లోనే భద్రంగా ఉండాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అధికారులను ఆదేశించారు. దీంతో ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

New Update
Mojtaba Khamenei

Mojtaba Khamenei

Mojtaba Khamenei : సుదీర్ఘ కాలంగా అంతర్జాతీయ వేదికలపై అగ్గిరాజేస్తున్న ఇరాన్ అణు కార్యక్రమం మరోసారి తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అమెరికా - ఇరాన్ దేశాల మధ్య కీలకమైన చర్చలు జరగడానికి ముందే ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ అత్యంత వ్యూహాత్మక, సంచలన ఆదేశాలు జారీ చేశారు. తమ దేశంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఎట్టిపరిస్థితుల్లోనూ విదేశాలకు పంపే ప్రసక్తే లేదని, అవన్నీ ఇరాన్‌లోనే భద్రంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెడుతున్న అల్టిమేటమ్‌లకు లొంగేది లేదని ఖమేనీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

అమెరికాతో దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కానున్న తరుణంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఈ కీలక ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఇరాన్ వద్ద ప్రస్తుతం ఉన్న అణు ఇంధనాన్ని, శుద్ధి చేసిన యురేనియం నిల్వలను ఏ దేశానికీ బదిలీ చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆదేశాల వల్ల రాబోయే రోజుల్లో అమెరికాతో జరగబోయే శాంతి చర్చలు మరింత సంక్లిష్టంగా మారే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ వద్ద ఎట్టిపరిస్థితుల్లోనూ అణు ఆయుధాల తయారీకి పనికొచ్చే యురేనియం నిల్వలు ఉండకూడదన్నది అమెరికా ప్రధాన డిమాండ్. ఇరాన్ భూభాగం నుండి ఆ యురేనియం నిల్వలను పూర్తిగా బయటకు తరలిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే ప్రకటించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నామరూపాలు లేకుండా చేయడమే లక్ష్యంగా అమెరికా అడుగులు వేస్తోంది.

మరోవైపు, పశ్చిమాసియా (Middle East) లో ఇరాన్‌కు ప్రధాన శత్రువుగా ఉన్న ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా గట్టి హామీ ఇచ్చింది. ఇరాన్‌తో జరిపే ఏ శాంతి చర్చల్లోనైనా సరే.. 'యురేనియం నిల్వలను ఇరాన్ వెలుపలికి తరలించడం' అనే అంశాన్ని ఖచ్చితమైన నిబంధనగా పెడతామని ట్రంప్ ఇజ్రాయెల్‌కు గతంలోనే మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్‌ను సంతృప్తి పరచడం కోసం అమెరికా గట్టి పట్టుబడుతుండగా.. దానికి ఏమాత్రం తలొగ్గకూడదని ఇరాన్ భావిస్తోంది.

ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తాజా నిర్ణయంతో అమెరికా కూటమి వర్సెస్ ఇరాన్ మధ్య అగాధం మరింత పెరిగింది. ఒకవైపు ఆర్థిక ఆంక్షలతో ఇరాన్‌ను దెబ్బతీయాలని అమెరికా చూస్తుంటే.. తమ దేశ సార్వభౌమత్వాన్ని, అణు హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చిచెప్పింది. యురేనియం ఇరాన్ లోనే ఉంటుందనే ఖమేనీ పట్టుదల కారణంగా, రాబోయే రోజుల్లో శాంతి చర్చలు కుప్పకూలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ తీసుకున్న ఈ దూకుడు నిర్ణయం పశ్చిమాసియాలో ఏ రకమైన కొత్త సంక్షోభానికి దారితీస్తుందోనని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది.

Advertisment
తాజా కథనాలు