/rtv/media/media_files/2026/05/18/us-2026-05-18-10-10-26.jpg)
అమెరికాలోని ఐడహోలో జరిగిన గన్‌ఫైటర్ స్కైస్ ఎయిర్ షోలో ఒక అత్యంత అరుదైన, ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం చోటుచేసుకుంది. గాల్లో విన్యాసాలు చేస్తూ అమెరికా నౌకాదళానికి చెందిన రెండు అత్యాధునిక యుద్ధ విమానాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. అయితే, విమానాలు కిందపడి పేలిపోయే కొన్ని సెకన్ల ముందే నలుగురు పైలట్లు పారాచూట్ల సాయంతో సురక్షితంగా బయటపడటం సాహసానికి పరాకాష్టగా నిలిచింది. ఐడహోలోని మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఈ ఎయిర్ షో జరుగుతోంది. వాషింగ్టన్‌కు చెందిన యూఎస్ నేవీ ఎలక్ట్రానిక్ అటాక్ స్క్వాడ్రన్ 129కి చెందిన రెండు EA-18G గ్రోలర్ యుద్ధ విమానాలు గాల్లో అత్యంత సమీపంగా ప్రయాణిస్తూ విన్యాసాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఊహించని విధంగా రెండు జెట్లు ఒకదానికొకటి తాకాయి. క్షణాల్లో రెండు విమానాలు ఒకదానికొకటి చిక్కుకుపోయి, గాల్లోనే తిరుగుతూ వేగంగా భూమి వైపు దూసుకురావడం ప్రారంభించాయి. దీన్ని చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు.
విమానాలు నేలను తాకడానికి మరికొన్ని సెకన్లు మాత్రమే సమయం ఉందనగా.. నలుగురు పైలట్లు ఎంతో చాకచక్యంగా విమానాల నుండి విడివడి (Eject) పారాచూట్ల ద్వారా గాల్లోకి వచ్చారు. వారు అలా బయటపడిన మరుక్షణమే.. ఆ రెండు యుద్ధ విమానాలు బేస్ సమీపంలో పడి భారీ నిప్పుల ముద్దగా మారిపోయాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది.
ఎలాంటి గాయాలు కాలేదు
ప్రస్తుతం ఆ నలుగురు పైలట్ల ఆరోగ్యం స్థిరంగా ఉందని, కింద ఉన్న ప్రేక్షకులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. సాధారణంగా గాల్లో యుద్ధ విమానాలు ఢీకొంటే పైలట్లు ఎస్కేప్ అవ్వడానికి సమయం దొరకడం దాదాపు అసాధ్యమని ఏవియేషన్ నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ ప్రమాదంలో విమానాలు ఢీకొన్న తీరే పైలట్ల ప్రాణాలు కాపాడిందని మాజీ ఏవియేషన్ సేఫ్టీ ఇన్వెస్టిగేటర్ జెఫ్ గుజ్జెట్టి అభిప్రాయపడ్డారు.
రెండు విమానాలు ఒకదానికొకటి తగిలినప్పటికీ, అవి ముక్కలు కాకుండా కాసేపు అలాగే కలిసి కిందకు జారాయి. దీనివల్ల విమానాలు పూర్తిగా నియంత్రణ కోల్పోవడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది. ఆ గ్యాప్‌లోనే పైలట్లు అలర్ట్ అయి చాకచక్యంగా ఎజెక్ట్ అవ్వగలిగారు. ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలని - జెఫ్ గుజ్జెట్టి, ఏవియేషన్ సేఫ్టీ ఎక్స్‌పర్ట్ అన్నారు. మరో నిపుణుడు జాన్ కాక్స్ మాట్లాడుతూ.. ఎయిర్ షోలలో విన్యాసాలు చేయడం కత్తి మీద సాము లాంటిదని, ఇక్కడ పొరపాట్లకు అస్సలు తావుండదని పేర్కొన్నారు.
ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ బేస్‌ను లాక్‌డౌన్ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ రంగంలోకి దిగి మంటలను అదుపు చేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రేక్షకులను వెంటనే అక్కడి నుండి పంపించివేసి, రెండు రోజుల పాటు జరగాల్సిన ఈ ఎయిర్ షోను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు ప్రారంభమైంది.
Follow Us