/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)
Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, కమాండర్ ఇన్ చీఫ్‌గా దేశానికి సేవలు అందించడానికి ఆయన శారీరకంగా, మానసికంగా ఫుల్ ఫిట్ గా ఉన్నారని ఆయన వ్యక్తిగత వైద్యుడు ప్రకటించారు. ట్రంప్‌కు దాదాపు మూడు గంటల పాటు పలు ఆరోగ్య పరీక్షలు జరిగాయి. దీనికి సంబంధించిన హెల్త్ రిపోర్టును డాక్టర్ సీన్ బార్బబెల్లా తాజాగా విడుదల చేశారు. ఈ పరీక్షల అనంతరం 79 ఏళ్ల ట్రంప్ స్పందిస్తూ.. తన ఆరోగ్యం అంతా పర్‌ఫెక్ట్ గా ఉందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఈ మెడికల్ ఎగ్జామినేషన్‌లో 22 మంది నిపుణులైన డాక్టర్లు పాల్గొని ట్రంప్‌కు సిటి స్కాన్, హార్ట్ ఇమేజింగ్, క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి అనేక ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రస్తుత రిపోర్ట్ ప్రకారం ట్రంప్ బరువు 238 పౌండ్లు (108 కిలోలు)గా తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఆయన దాదాపు 6 కిలోల బరువు పెరిగారు. ఆయన ఎత్తు 6 అడుగుల 3 అంగుళాలు ఉండటంతో, బాడీ మాస్ ఇండెక్స్ 29.7 గా నమోదైంది. వైద్యుల లెక్కల ప్రకారం BMI 30 దాటితే ఊబకాయం అంటారు.. అంటే ట్రంప్ తృటిలో ఆ మార్కును తప్పించుకున్నారు. బరువు తగ్గడానికి డైట్, వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచించినప్పటికీ, ఆయన శారీరక, మానసిక పనితీరు మాత్రం అద్భుతంగా ఉందని కొనియాడారు.
ఈ హెల్త్ రిపోర్ట్‌లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా వెల్లడయ్యాయి. ట్రంప్ చేతులపై కొన్ని వాతలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. నిరంతరం ప్రజలతో, నాయకులతో చేతులు కలపడం వల్ల ఆయన వాడుతున్న ఆస్పిరిన్ టాబ్లెట్ల ప్రభావం వల్లే ఈ సున్నితమైన చర్మ సమస్య వచ్చిందని, కంగారు పడాల్సిన పనిలేదని తెలిపారు. అలాగే గత ఏడాది ట్రంప్‌కు కాళ్లలో రక్తం గడ్డకట్టే క్రానిక్ వీనస్ ఇన్‌సఫిషియెన్సీ అనే వృద్ధాప్య సమస్య ఉన్నట్లు తేలింది. తాజా పరీక్షల్లో కాళ్ల వాపులు ఉన్నప్పటికీ, గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి చాలా మెరుగైందని డాక్టర్లు చెప్పారు.
గుండె పనితీరు చాలా బాగుంది
ముఖ్యంగా, ట్రంప్ కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుతుండటంతో ఆయన గుండె పనితీరు చాలా బాగుందని, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉన్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. బిజీ షెడ్యూల్, వరుస మీటింగ్‌లు, పబ్లిక్ మీటింగ్‌లు, గోల్ఫ్ ఆడటం వంటివి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని డాక్టర్ బార్బబెల్లా రాశారు.
వచ్చే నెలలో ట్రంప్ 80వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఎక్కువ వయసులో అధ్యక్షుడైన వ్యక్తి ఆయనే. ఆయన కంటే ముందున్న జో బైడెన్ (82) వయసు రీత్యా వచ్చిన విమర్శల వల్లే 2024 ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే మధ్యంతర ఎన్నికల కంటే ముందు తన వయసుపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టడానికే ట్రంప్ ఈ హెల్త్ రిపోర్టును బయటపెట్టినట్లు తెలుస్తోంది. తనకు ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టమని, గోల్ఫ్ ఆడటం మినహా పెద్దగా వ్యాయామాలు చేయనని ట్రంప్ సరదాగా చెబుతుంటారు. అయినప్పటికీ, తాను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో.. ఇప్పుడూ అలాగే ఫీలవుతున్నానని ఆయన గట్టిగా చెబుతున్నారు.
Follow Us