Donald Trump : మా ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే బాంబుల వర్షం కురిపిస్తాం..ఇరాన్ కు ట్రంప్‌ మరో హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనున్న తరుణంలో, అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులకు ఇరాన్ అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.

New Update
Donald Trump

Donald Trump

Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వానికి అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం గడువు ముగియనున్న తరుణంలో, అమెరికా ప్రతిపాదించిన కొత్త షరతులకు ఇరాన్ అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తాము మంచితనంతో వ్యవహరించామని, అయితే రేపు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న చర్చల్లో ఇరాన్ సానుకూల నిర్ణయం తీసుకోకపోతే పరిణామాలు యుద్ధానికి దారితీస్తాయని తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా స్పష్టం చేశారు.

హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ వైఖరిపై ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. నిన్న ఇరాన్ దళాలు ఫ్రెంచ్ , బ్రిటన్ నౌకలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఒప్పంద ఉల్లంఘనేనని మండిపడ్డారు. హోర్ముజ్‌ను మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం విడ్డూరంగా ఉందని, వాస్తవానికి ఈ చర్య వల్ల ఇరాన్ రోజుకు 500 మిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని కోల్పోతోందని విమర్శించారు. ఇరాన్ తీరు వల్ల ప్రపంచ దేశాలు చమురు కోసం అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు మళ్లుతున్నాయని, ఇది పరోక్షంగా తమ దేశ ఆర్థిక వ్యవస్థకే మేలు చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

ఇరాన్‌కు తాము ఇప్పటికే ఒక సముచితమైన 'డీల్'ను ప్రతిపాదించామని, దానికి వారు అంగీకరిస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరించి ఒప్పందాన్ని తిరస్కరిస్తే, ఆ దేశంలోని ప్రతి విద్యుత్ ప్లాంట్ ,ప్రతి వంతెనను బాంబులతో ధ్వంసం చేస్తామని భీకర హెచ్చరిక చేశారు. గత అమెరికా అధ్యక్షులు ఎప్పుడో పూర్తి చేయాల్సిన ఈ పనిని, ఇప్పుడు తాను ముగించాల్సి వస్తే దానిని ఒక గౌరవంగా భావిస్తానని, ఇరాన్‌కు శాశ్వతంగా చెక్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఈ పరిస్థితుల నేపథ్యంలో, ఇస్లామాబాద్‌లో రేపు జరగబోయే అమెరికా-ఇరాన్ ప్రతినిధుల సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఒకవైపు ఇరాన్ తన సైనిక చర్యలతో కయ్యానికి కాలుదువ్వుతుండగా, మరోవైపు ట్రంప్ తన వ్యూహాత్మక మరియు సైనిక హెచ్చరికలతో ఒత్తిడి పెంచుతున్నారు. ఈ చర్చల ఫలితం మధ్యప్రాచ్య దేశాల భవిష్యత్తును, ప్రపంచ చమురు మార్కెట్‌ను శాసించే అవకాశం ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ ఈ సమావేశం వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు